TDP Mahanadu: గుడివాడలో టీడీపీ మినీ మహానాడు వాయిదా!... కారణమిదే!
- రేపే గుడివాడలో టీడీపీ మినీ మహానాడు
- హాజరు కానున్న టీడీపీ అధినేత చంద్రబాబు
- భారీగా కురిసిన వర్షంతో బురదమయంగా వేదిక
- వేదికను పరిశీలించి మహానాడు సాధ్యం కాదని తేల్చిన నేతలు
కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నిర్వహించతలపెట్టిన మినీ మహానాడు వాయిదా పడింది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం మహానాడు నిర్వహించనున్న వేదికను పరిశీలించిన టీడీపీ నేతలు... మినీ మహానాడును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గుడివాడలో సోమవారం నుంచి భారీ వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా మహానాడు వేదిక మొత్తం బురదమయంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మహానాడు నిర్వహణ సాధ్యం కాదని తేల్చిన టీడీపీ నేతలు మినీ మహానాడును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి మినీ మహానాడును ఎప్పుడు నిర్వహించనున్న విషయంపై త్వరలోనే పార్టీ నుంచి ప్రకటన రానుంది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇటీవలే జిల్లాల పర్యటనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జిల్లాల పర్యటనల్లో ఆయా జిల్లాలకు చెందిన ఓ ప్రాంతంలో మినీ మహానాడును నిర్వహిస్తూ చంద్రబాబు సాగుతున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మినీ మహానాడును గుడివాడలో ఈ నెల 29న నిర్వహించాలని నిర్ణయించగా...గుడివాడ సమీపంలో వేదికను కూడా ఖరారు చేశారు. టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి తమ సత్తా ఏమిటో చూపించాలన్న కసితో గుడివాడ మినీ మహానాడుకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. అయితే వర్షం కారణంగా ఈ మినీ మహానాడు వాయిదా పడిపోయింది.