Eoin Morgan: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్
- ఇంగ్లండ్ కు చిరస్మరణీయ విజయాలు అందించిన మోర్గాన్
- మోర్గాన్ కెప్టెన్సీలో ప్రబలశక్తిగా ఇంగ్లండ్
- వన్డేలు, టీ20ల్లో మేటి జట్టుగా ఎదిగిన వైనం
- ఇటీవల ఫామ్ లో లేని మోర్గాన్
క్రికెట్ పుట్టిల్లు ఇంగ్లండ్ కు వన్డేల్లో మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన తరుణం అని మోర్గాన్ పేర్కొన్నాడు.
ఎంతగానో ఆస్వాదించిన ఆట నుంచి, తన జీవితంలో ఓ బహుమతి వంటి ఈ అధ్యాయానికి ముగింపు పలకడం ఏమంత సులభమైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. తన వీడ్కోలు నిర్ణయం తనకు వ్యక్తిగతంగానూ, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు పరంగానూ సరైనదేనని భావిస్తున్నానని తెలిపాడు. రెండు వరల్డ్ కప్ లు గెలిచిన జట్టులో భాగం కావడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తానని మోర్గాన్ వివరించాడు. భవిష్యత్తులో ఇంగ్లండ్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ లో మరింత దేదీప్యమానంగా వెలుగొందుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఎంతో అనుభవం, మరెంతో లోతైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఇంగ్లండ్ జట్టు సొంతమని అభిప్రాయపడ్డాడు.
జన్మతః ఐర్లాండ్ జాతీయుడైన ఇయాన్ మోర్గాన్ ఇంగ్లండ్ జట్టుకు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా అనేక చిరస్మరణీయ విజయాలు అందించాడు. అంతేకాదు, ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు (6,957), టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు (2,458) రికార్డులు ఇప్పటికీ మోర్గాన్ పేరిటే ఉన్నాయి. దాంతో పాటే, ఈ రెండు ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరఫున అత్యధిక సిక్సుల వీరుడు కూడా మోర్గానే.
ప్రస్తుతం ఇయాన్ మోర్గాన్ వయసు 35 ఏళ్లు. 2006లో ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2009లో ఇంగ్లండ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించిన మోర్గాన్ అక్కడ్నించి వెనుదిరిగి చూడలేదు. ఇంగ్లండ్ కు కెప్టెన్ గా ఎదగడమే కాదు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఆ జట్టును ప్రబల శక్తిగా తీర్చిదిద్దాడు.
మోర్గాన్ తన మొత్తం కెరీర్ లో 248 వన్డేలు ఆడి 7,701 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు 47 ఫిఫ్టీలు ఉన్నాయి. 115 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 2,458 పరుగులు సాధించాడు. 16 టెస్టులు ఆడి 700 పరుగులు నమోదు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.
అయితే, కొంతకాలంగా మోర్గాన్ ను గాయాలు వేధిస్తుండగా, వన్డేలు, టీ20ల్లో ఫామ్ లో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఏ జట్టు కూడా మోర్గాన్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ కూడా జరగనుండగా, ఇక తాను తప్పుకోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాడు. మోర్గాన్ ఆటకు వీడ్కోలు పలకనున్నాడంటూ మీడియాలో నిన్ననే కథనాలు వచ్చాయి. ఆ మేరకు మోర్గాన్ ఇవాళ ఓ ప్రకటనతో తన అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలికాడు.