floating house: భారీ వదరలు వచ్చినా ఈ ఇల్లు మునగదు.. జపాన్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
- చుట్టూ వరదనీరు చేరినా ఇంట్లోని వారికి రక్షణ
- 5 మీటర్ల ఎత్తు వరకు నీటిపై తేలియాడే ఇల్లు
- రూపొందించిన జపాన్ కంపెనీ ఇచిజో కొముటెన్
జపాన్ శాస్త్రవేత్తలు ఓ సరికొత్త ఇంటిని రూపొందించారు. ఎంతటి భారీ వరదలు వచ్చినా ఈ ఇంటిలోని వారికి ఏమీ కాదు. ఎందుకంటే ఇది వరద నీటిపై తేలి ఉంటుంది. జపాన్ హౌసింగ్ డెవలప్ మెంట్ కంపెనీ ‘ఇచిజో కొముటెన్’ ఈ ఇంటి సృష్టికర్త. వరద బాధిత ప్రాంతాలకు ఈ ఇల్లు అనుకూలమని ప్రకటించింది. ఈ ఇంటి నిర్మాణం వినూత్నంగా, వాటర్ ప్రూఫ్ తో ఉంటుంది. సాధారణంగా ఇది నేలపైనే ఉంటుంది. ఒక్కసారి వరద నీరు చుట్టూ చేరితే క్రమంగా పైకి తేలుతుంది.
ఈ ఇల్లు ఎలా పైకి తేలుతుందో సదరు కంపెనీ ప్రదర్శించి చూపించింది. ఇంటి చుట్టూ పైపుతో నీరు వదిలిపెట్టగా, క్రమంగా ఇల్లు పైకి తేలడం వీడియోలో కనిపిస్తోంది. ఐరన్ రాడ్స్ తో ఇంటిని నిర్మిస్తారు. వరదనీటిలో ఇల్లు కొట్టుకుపోకుండా ఉండేందుకు కేబుల్స్ సాయంతో కట్టిపడేస్తారు.
తిరిగి వరద నీరు మొత్తం వెళ్లిపోగానే ఇల్లు దానంతట అదే కిందకు దిగిపోతుంది. సుమారు 5 మీటర్ల ఎత్తు వరకు నీటిపై ఇల్లు తేలుతుంది. ఇంటి పైనుంచే విద్యుత్ సదుపాయం ఉంటుంది కనుక ప్రమాద భయం లేదు. జపాన్ భూకంపాలు, వరదల విపత్తులను ఎదుర్కొంటుంటుంది. ఆ దేశంతోపాటు మన దేశంలోని అసోం రాష్ట్రానికి సైతం ఈ ఇల్లు అనుకూలంగా ఉంటుంది.