Shiv Sena: గోవాకు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. ఏక్ నాథ్ షిండే వెంటే ఉంటామంటూ నినాదాలు
- హోటల్ నుంచి బస్సుల్లో గువాహటి విమానాశ్రయానికి..
- ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ లో గోవాకు బయలుదేరిన ఎమ్మెల్యేలు
- అసెంబ్లీలో థాకరే బల నిరూపణ నేపథ్యంలోనే బయటికి వచ్చారనే ప్రచారం
- గురువారం వారు ముంబైకి వెళ్లవచ్చంటున్న రాజకీయ వర్గాలు
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు చాలా రోజుల తర్వాత బయటికి వచ్చారు. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో అసోంలోని గువాహటిలో ఓ ప్రైవేటు హోటల్ నుంచి గోవాకు బయలుదేరారు. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ను ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో ఇది ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా నేరుగా ముంబైకి వెళ్లకుండా సమీపంలోని గోవాకు వెళ్తున్నారు. అక్కడ ఇప్పటికే ఓ హోటల్ లో వారికోసం ఏర్పాట్లు సిద్ధమైనట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వారు గురువారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి ముంబైకి చేరుకునే అవకాశముందని పేర్కొంటున్నాయి.
ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ లో..
తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గువాహటి విమానాశ్రయం నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్ లో గోవాకు బయలుదేరారు. విమానాశ్రయంలోకి ప్రవేశించే ముందు ఎమ్మెల్యేలంతా మీడియా ఎదుట పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘‘ఛత్రపతి శివాజీ మహరాజ్ కీ జై, ఏక్ నాథ్ షిండే సాహెబ్ మీరు ముందు వెళ్లండి.. మేమంతా మీ వెంట ఉన్నాం..” అని నినాదాలు చేశారు.
పొద్దున్నే ఓసారి బయలుదేరినా..
బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఒకేసారి హోటల్ నుంచి బయటికి వచ్చి ప్రత్యేక బస్సుల్లో ఎక్కారు. అప్పుడే వారంతా ముంబైకి బయలుదేరారని వార్తలు వచ్చాయి. కానీ వారంతా ప్రసిద్ధ కామాఖ్య ఆలయానికి వెళ్లి దర్శనాలు చేసుకుని తిరగి మళ్లీ హోటల్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో సాయంత్రం కూడా వారు ఎక్కడికి వెళతారన్నది తొలుత ఉత్కంఠ రేపింది. అయితే వారంతా గువాహటి విమానాశ్రయానికి చేరుకుని గోవాకు బయలుదేరారు.