most expensive: మన దేశంలోని ఈ నగరాల్లో నివసించాలంటే విదేశీయుల జేబుకు చిల్లే!
- ఐదు నగరాల్లో నివాస ఖర్చులు పెరిగాయని ఓ సర్వేలో వెల్లడి
- మొదటి స్థానంలో నిలిచిన ముంబై
- జాబితాలో ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కూడా
భారతదేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో నివసించడం చాలా ఖరీదుగా మారిందని ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా మన దేశానికి వచ్చే విదేశీ ఉద్యోగులు ఈ నగరాల్లో నివసించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని తెలిపింది. ఈ మేరకు మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ మెర్సెర్స్ ‘మెర్సెర్స్ 2022 కాస్ట్ ఆఫ్ లివింగ్ (జీవన వ్యయం) సిటీ ర్యాంకింగ్స్’ ను విడుదల చేసింది.
దీని ప్రకారం దేశంలో జీవన వ్యయం అధికంగా ఉన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 127 వ ర్యాంక్‌లో నిలిచింది. అంతర్జాతీయ ఉద్యోగులు ముంబైలో నివసించడం ఎక్కువ ఖరీదుగా మారిందని మెర్సెర్స్ సర్వే వివరించింది. ముంబై తర్వాత ఖరీదైన నగరాలుగా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నగరాలకు వరుసగా 155, 177, 178 , 192వ ర్యాంకులు దక్కాయి.
మెర్సెర్స్ ర్యాంకింగ్స్ బట్టి చూస్తే దేశంలో విదేశీ ఉద్యోగులకు అత్యంత చౌక అయిన నగరాలుగా పూణె, కోల్‌కతా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా జీవన వ్యయ ర్యాంకింగ్‌లో ఈ నగరాలకు 201, 203వ స్థానాలు దక్కాయి. వివిధ నగరాల్లోని సుమారు 200 కు పైగా అంశాలను పోల్చి మెర్సెస్ ఈ జాబితా విడుదల చేసింది. హౌసింగ్, రవాణా, ఆహారం, దుస్తులు, గృహోపకరణాలు, వినోదంతో సహా 200 కంటే ఎక్కువ వస్తువుల తులనాత్మక ధరను పరిశీలించి ఆయా నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. తమ ఉద్యోగులను ఇతర దేశాలకు పంపేటప్పుడు అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఉద్యోగులకు పరిహారం అందించడానికి కంపెనీలకు ఈ సర్వే డేటా సాయపడుతుందని మెర్సెర్స్ అభిప్రాయపడింది.
ప్రపంచం మొత్తంలో విదేశీ ఉద్యోగులకు జీవన వ్యయం అధికంగా ఉన్న నగరాల్లో హాంకాంగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క స్విట్జర్లాండ్‌లోని నాలుగు నగరాలు రెండు నుంచి ఐదో స్థానం వరకు ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని జూరిచ్, జెనీవా, బసెల్, బెర్నె నగరాలు టాప్5 లో ఉన్నాయని మెర్సెర్స్ సర్వే వెల్లడించింది.