england: క్రికెట్ వదిలేసి కామెంటరీకి సిద్ధమైన వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్
- మంగళవారమే రిటైర్మెంట్ ప్రకటించిన మోర్గాన్
- భారత్, ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్ లతో వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్
- ఇంగ్లండ్ విజయవంతమైన కెప్టెన్ గా మంచి పేరు
నాయకుడిగా ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మోర్గాన్ తన బ్యాటింగ్ తో పాటు నాయకత్వ నైపుణ్యాలను ఇంగ్లండ్ జట్టుకు ఎనలేని సేవ చేశాడు. అతని సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు తొలిసారి 2019 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. రిటైర్మెంట్ తర్వాత కామెంటరీ చేయాలని మోర్గాన్ నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జులైలో జరిగే టీ20, వన్డే సిరీసుల్లో మోర్గాన్ టీవీ వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించబోతున్నాడు. ఈ వేసవిలో ఇంగ్లండ్ ఆడబోయే సిరీసుల్లో వ్యాఖ్యానం చేసేందుకు మోర్గాన్ తమ కామెంటరీ ప్యానెల్ లో చేరేందుకు అంగీకరించాడని ప్రసారకర్త స్కై స్పోర్ట్స్ తెలిపింది. మోర్గాన్ వీడ్కోలు నిర్ణయం ప్రకటించిన ఐదు నిమిషాల్లోనే ఈ విషయం ప్రకటించడం గమనార్హం.
పరిమిత ఓవర్లలో ఇంగ్లండ్ ఆటను కొత్త పుంతలు తొక్కించిన కెప్టెన్ గా మోర్గాన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. 2014 చివర్లో ఇంగ్లండ్ వన్డే, టీ20 ఫార్మాట్ నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు. తర్వాతి ఏడాది ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ మెగా ఈవెంట్‌లో పరాజయం తర్వాత, ఇంగ్లండ్ జట్టులో చాలా మంది కొత్త ఆటగాళ్లను చేర్చడం, జట్టులో కొన్ని పెద్ద మార్పులు చేయడంలో మోర్గాన్ కీలకంగా వ్యవహరించాడు.
మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లండ్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో దూకుడైన ఆటతో సరికొత్త పంథా ఆరంభించి విజయం సాధించింది. ఈ క్రమంలో సొంతగడ్డపై ప్రపంచ కప్ కూడా అందుకుంది. ఆ జట్టు చాలా సార్లు 400 పైచిలుకు స్కోర్లు చేసింది. ఇటీవలే నెదర్లాండ్స్‌పై 498 పరుగుల తేడాతో వన్డే క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించింది.
అయితే, ఈ మధ్య ఇంగ్లండ్ పెద్దగా రాణించడం లేదు. మోర్గాన్ ఆట కూడా దెబ్బతింది. దాంతో, తన అంతర్జాతీయ కెరీర్ ముగించాలని మోర్గాన్ నిర్ణయం తీసుకున్నాడు. మోర్గాన్ 248 వన్డేలు ఆడి దాదాపు 40 సగటుతో 7701 పరుగులు చేశాడు. 115 టీ20 మ్యాచ్‌లలో 2458 పరుగులు చేశాడు. 16 టెస్టు మ్యాచులు మాత్రమే ఆడిన అతను 700 పరుగులు సాధించాడు.