Boris Johnson: పుతిన్ కనుక మహిళ అయి ఉంటే ఉక్రెయిన్‌పై యుద్ధం జరిగేదే కాదు: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
![Putin would not have embarked on Ukraine war if he were a woman said Boris Johnson](https://imgd.ap7am.com/thumbnail/cr-20220630tn62bd1f4e3cafa.jpg)
- పుతిన్ దండయాత్రకు మకీజ్మో కారణమన్న బోరిస్
- విష పురుషత్వానికి 69 ఏళ్ల పుతిన్ నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్య
- ఎక్కువ మంది మహిళలు అధికార స్థానంలో ఉంటేనే ప్రపంచశాంతి అన్న బోరిస్
నెలల తరబడి కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కనుక మహిళ అయి ఉంటే ‘ఈ వెర్రి, పురుషాహంకార యుద్ధం’ జరిగి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. జీ7 సదస్సు ముగింపు అనంతరం జర్మన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్సన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధానికి తెగబడడానికి మకీజ్మో (పురుషాహంకారం) ప్రధాన కారణమని అన్నారు.
అంతేకాదు, ప్రపంచ శాంతి కోసం ఎక్కువమంది మహిళలు అధికార స్థానాల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ‘పుతిన్ కనుక మహిళ అయి ఉంటే కచ్చితంగా ఈ వెర్రి, పురుషాహంకారంతో కూడిన ఈ దండయాత్రను ప్రారంభించి ఉండేవాడు కాదు’’ అని జడ్‌డీఎఫ్ (ZDF) బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ జాన్సన్ చెప్పుకొచ్చారు. విష పురుషత్వానికి 69 ఏళ్ల రష్యా అధ్యక్షుడు సరైన నిర్వచనమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.