Pawan Kalyan: శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా కూలీల సజీవదహనంపై పవన్ కల్యాణ్ స్పందన
- సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం
- విద్యుత్ తీగలు తెగిపడి ఆటో దగ్ధం
- మంటల్లో చిక్కుకుని మరణించిన ఐదుగురు కూలీలు
- మనసు కలచివేస్తోందన్న పవన్ కల్యాణ్
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి వద్ద విద్యుత్ హైటెన్షెన్ వైర్లు తెగిపడి ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనం కావడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళుతుండగా, ఆ వాహనంపై విద్యుత్ తీగలు తెగిపడి ఈ ఘోరం జరిగినట్టు తెలిసిందని వివరించారు.
రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాల్లో చోటుచేసుకున్న హృదయవిదారకమైన ఈ విషాదం మనసును కలచివేసిందని తెలిపారు. ఆ కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం చూస్తుంటామని, అయితే వాతావరణం సాధారణంగా ఉన్న ఈ రోజున హైటెన్షన్ వైర్లు తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా? అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచడం మీద చూపించిన శ్రద్ధను విద్యుత్ లైన్ల నిర్వహణపైనా చూపాలని హితవు పలికారు.
అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి ఉంటున్నాయని, అలాగే జనావాసాల మీదుగా ప్రమాదకరరీతిలో విద్యుత్ తీగలు వేళ్లాడుతున్నా పట్టించుకోవడంలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే నేడు ఐదు నిండుప్రాణాలు పోయాయని వ్యాఖ్యానించారు. తాడిమర్రి వద్ద జరిగిన దుర్ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలని స్పష్టం చేశారు.