Maharashtra: ఒకేసారి ఇద్దరు కుమారులు మ‌ర‌ణిస్తే డిప్రెష‌న్‌లోకి వెళ్లి.. మ‌హారాష్ట్ర సీఎంగా ఎదిగిన షిండే!

maharashtra new cm eknath shinde gone to depression for so many months

  • 1964 ఫిబ్ర‌వ‌రి 9న స‌తారా జిల్లాలో జ‌న్మించిన షిండే
  • జీవ‌నోపాధి నిమిత్తం థానే వ‌ల‌స వ‌చ్చిన కుటుంబం
  • ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ వ‌ర‌కే చ‌దివిన శివసేన నేత‌
  • 1980లో శివ‌సేన కార్య‌క‌ర్త‌గా స‌భ్య‌త్వం
  • 1997లో థానే కార్పొరేట‌ర్ ‌గా ఎన్నిక‌
  • 2004 నుంచి కొప్రి ప‌చ్‌ప‌క‌డీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం

మ‌హారాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా నేటి రాత్రి 7.30 గంట‌ల‌కు ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌నున్న ఏక్‌నాథ్ షిండే అట్ట‌డుగు స్థాయి నుంచి అత్యున్న‌త స్థాయికి ఎదిగిన నేత‌. అంతేకాదు... ఓ ప్ర‌మాదంలో 11 ఏళ్లు, 7 ఏళ్ల వ‌య‌సున్న తన ఇద్ద‌రు కుమారులు నీటిలో మునిగి చ‌నిపోగా... నెల‌ల త‌ర‌బ‌డి డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయిన మనిషాయన. ఆ బాధ నుంచి తేరుకుని మళ్లీ ఆయన మామూలు మనిషి అవుతాడా? అని సన్నిహితులంతా ఆందోళన చెందారు కూడా!   

మ‌హారాష్ట్రలోని ఎక్క‌డో మారుమూల ప‌ల్లెలో ఓ నిరుపేద మ‌రాఠా కుటుంబంలో పుట్టిన షిండే... జీవ‌నోపాధి కోసం కుటుంబం థానేకు త‌ర‌లిరాగా... బాల్య‌మంతా క‌ష్టాల‌తోనే కొన‌సాగించారు. ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ వ‌ర‌కు మాత్ర‌మే చ‌దివిని షిండే... ఆ త‌ర్వాత ఆటో డ్రైవ‌ర్‌గా మారిపోయారు. చ‌దువుకుంటూనే ఆటో డ్రైవ‌ర్‌గానూ ఆయ‌న ప‌నిచేశారు‌.

మ‌హారాష్ట్రలోని స‌తారా జిల్లా జ‌వాలీ తాలూకాలోని ఓ గ్రామంలో మ‌రాఠా కుటుంబంలో 1964 ఫిబ్ర‌వ‌రి 9న షిండే జ‌న్మించారు. ఆ కుటుంబం త‌మ జీవ‌నోపాధి కోసం షిండే చిన్న‌గా ఉన్న‌ప్పుడే థానేకు వ‌ల‌స వ‌చ్చింది. థానేలోని మంగ‌ళ హైస్కూల్ అండ్ జూనియ‌ర్ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ దాకా చ‌దివారు. కుటుంబానికి ఆస‌రాగా ఉండేందుకు ఖాళీ స‌మ‌యాల్లో ఆటోను న‌డిపేవారు. చ‌దువుపై అంత‌గా ఆస‌క్తి చూప‌ని షిండే... ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లోనే విద్య‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. కుటుంబ పోష‌ణ కోసం ఆటో డ్రైవ‌ర్‌గా మారిపోయారు. 

ఈ క్ర‌మంలో బాల్ థాక‌రే ఉప‌న్యాసాల‌కు ఆక‌ర్షితుడైన షిండే 1980లో శివ‌సేన‌లో ప్రాథ‌మిక స‌భ్య‌త్వం తీసుకున్నారు. పార్టీలో చురుకైన కార్య‌క‌ర్త‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. శివ‌సేన థానే న‌గ‌ర క‌మిటీ అధ్య‌క్షుడు ఆనంద్ దిఘేకు ముఖ్య అనుచ‌రుడిగా మారిపోయారు. 1997లో థానే న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో శివ‌సేన త‌ర‌ఫున కార్పొరేట‌ర్‌గా విజ‌యం సాధించారు. 

అలా రాజ‌కీయాల్లో దూసుకుపోతున్న స‌మ‌యంలోనే షిండేకు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చి ప‌డింది. 2000 జూన్ 2న షిండే స్వ‌గ్రామానికి వెళ్లిన ఆయ‌న ఇద్ద‌రు కుమారులు దీపేశ్‌ (11), శుభ‌ద (7) బోటు షికారుకు వెళ్లారు. వారెక్కిన బోటు బోల్తా కొట్ట‌డంతో నీటిలో మునిగి వారిద్ద‌రూ చ‌నిపోయారు. ఈ షాక్‌తో షిండే డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయారు. నెల‌ల త‌ర‌బ‌డి బ‌య‌టకే రాలేక‌పోయారు. 

ఈ క్ర‌మంలో ఆనంద్ దిఘే ఆయ‌న‌ను డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డేలా చేశారు. అందుకే ఆయనను షిండే తన మార్గదర్శిగా భావిస్తారు. ఇక ఆ మ‌రుస‌టి ఏడాది 2001లో ఆనంద్ దిఘే మ‌ర‌ణంతో ఖాళీ అయిన థానే శివ‌సేన అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను షిండే చేప‌ట్టారు. షిండేకు మొత్తం ముగ్గురు కుమారులు కాగా... మూడో కుమారుడు శ్రీకాంత్ షిండే మెడిసిన్ చ‌దివారు. శ్రీకాంత్ కూడా తండ్రి బాట‌లోనే న‌డిచి క‌ల్యాణ్ లోక్ స‌భ స్థానం నుంచి 2014లో ఎంపీగా ఎన్నిక‌య్యారు. 2019 ఎన్నిక‌ల్లో మరోమారు అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపీగా ఎన్నిక‌య్యారు.

2004లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో థానే ప‌రిధిలోని కొప్రి ప‌చ్‌ప‌క‌డీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి శివ‌సేన త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన షిండే తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై షిండే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌సరం రాలేదు. కొప్రి నుంచే ఆయ‌న వ‌రుస‌గా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. మొన్న‌టిదాకా ఉద్ధ‌వ్ థాక‌రే కేబినెట్‌లో ప‌ట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అంత‌కుముందు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కేబినెట్‌లోనూ షిండే పూర్తి కాలం మంత్రిగా ప‌నిచేశారు. తాజాగా మ‌హారాష్ట్ర సీఎంగా షిండే గురువారం రాత్రి ప‌ద‌వీ ప్ర‌మాణం చేయ‌నున్నారు.

  • Loading...

More Telugu News