Andhra Pradesh: అమరావతి ఉద్యోగులకు 5 రోజుల పని విధానం ఏడాది పాటు పొడిగింపు
- ఈ నెల 27తోనే ముగిసిన 5 రోజుల పని విధానం
- పొడిగిస్తారా? లేదా? అన్న సందిగ్ధంలో ఉద్యోగులు
- ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటిదాకా అమలు అవుతున్న వారానికి 5 రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం సాయంత్రం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సచివాలయం, ఆయా శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి వారానికి 5 రోజుల పని విధానం ఈ నెల 27తోనే ముగిసింది. అయితే దానిని పొడిగించడం గానీ, అసలు దానిపై స్పందిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన గానీ ఏదీ రాని నేపథ్యంలో ఈ శనివారం (జులై 2) విధులకు హాజరు కావాలా? వద్దా? అన్న సందిగ్ధంలో ఉద్యోగులు పడిపోయారు. అయితే ఆ పని విధానాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇవ్వడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.