Manipur: మణిపూర్‌లో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్ల సహా 8 మంది మృతి
- రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతుండగా ఘటన
- శిథిలాల కింద మరో 70 మంది
- వారిలో 43 మంది జవాన్లు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటన
మణిపూర్‌లోని నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జిరిబమ్-ఇంఫాల్ మార్గంలో తుపుల్ యార్డు వద్ద రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో గత రాత్రి కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 70 మంది గల్లంతయ్యారు.
మృతి చెందినవారిలో ఏడుగురు రైలు మార్గ నిర్మాణ పనుల వద్ద భద్రతా విధుల్లో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ జవాన్లు కాగా, ఒక పౌరుడు ఉన్నారు. మరో 13 మంది జవాన్లు, ఐదుగురు పౌరులను కాపాడారు. మరో 43 మంది జవాన్లు సహా 70 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మరోవైపు, కొండచరియలు విరిగి ఎజెయ్ నదికి అడ్డంగా పడడంతో నదీ ప్రవాహం ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.