TRS: ఒంటికాలిపై గెంతుతూ స్కూలుకెళుతున్న బాలిక... వివరాలిస్తే సాయం చేస్తానన్న కేటీఆర్
- బీహార్‌లోని సివాన్ ప్రాంతానికి చెందిన ప్రియాన్షు కుమారి
- పాఠశాలకు వెళుతున్న బాలికపై వార్తను ప్రచురించిన ఏఎన్ఐ
- వెనువెంటనే స్పందించిన కేటీఆర్
- బాలికకు వ్యక్తిగతంగానే సాయం చేస్తానని ప్రకటన
బీహార్‌లోని సివాన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక ప్రియాన్షు కుమారి తనకున్న ఒంటికాలిపై రోజూ 2 కిలో మీటర్లు గెంతుకుంటూ స్కూలుకెళ్లి తిరిగి వస్తోంది. చిన్న నాటి నుంచి తాను ఇలాగే పాఠశాలకు వెళుతున్నానని, తనకు ఓ కృత్రిమ కాలును అందజేయండి అంటూ ఆ బాలిక వేడుకుంటోంది. ఒంటికాలిపై పాఠశాలకు వెళ్లడం కష్టమే అవుతున్నప్పటికీ డాక్టర్ కావాలనే కలను మాత్రం వదిలిపెట్టేది లేదంటూ ఆ బాలిక చెబుతోంది. ఆ బాలిక కష్టాలపై ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ ఓ కధనాన్ని ప్రచురించింది.
ఈ కథనం చూసిన వెంటనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలిక వివరాలు ఉంటే తనకు అందజేయాలని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థను అభ్యర్థించారు. ఆ బాలిక వివరాలు అందిస్తే.. ఆమెకు అవసరమైన సాయాన్ని తాను వ్యక్తిగతంగానే అందిస్తానని కూడా కేటీఆర్ వెల్లడించారు. ఆ బాలికకు సాయం చేయడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని కూడా కేటీఆర్ పేర్కొన్నారు.