ycp corporater: నమస్కారం పెట్టనందుకు వైసీపీ కార్పొరేటర్ అనుచరుల దాడి
- రేషన్ వాహన డ్రైవర్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలు
- ఏలూరులో చోటుచేసుకున్న ఘటన
- నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని నారా లోకేశ్ డిమాండ్
ఎదురుపడిన నేతకు నమస్కారం పెట్టనందుకు.. చితకబాదిన వైనం ఏలూరులో చోటు చేసుకుంది. రేషన్ వాహన డ్రైవర్ శ్రీనివాసరావుపై వైసీపీ కార్పొరేటర్ స్రవంతి భర్త నాగరాజు, వారి అనుచరులు కలిసి దాడి చేసి చితకబాదారు. ఈ ఘటనలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
వైసీపీ నాయకుల సైకోయిజం ప్రజల పాలిట శాపంగా మారిందని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఏలూరులో నమస్కారం పెట్టలేదని రేషన్ వాహన డ్రైవర్ శ్రీనివాసరావు పై దాడి చెయ్యడాన్ని దారుణంగా పేర్కొన్నారు. వైసీపీ కార్పొరేటర్ స్రవంతికి నమస్కారం పెట్టలేదని ఆమె, ఆమె భర్త నాగరాజు, వారి అనుచరులు రోకలి బండతో దాడికి పాల్పడినట్టు తెలిపారు. శ్రీనివాసరావుపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ‘‘ఏమయ్యా జగన్ రెడ్డీ! నీ వైసీపీ రౌడీ మూక ఎదురుపడితే జనం నమస్కారం పెట్టాలని ఏ రాజ్యాంగంలో రాశారు? రాజారెడ్డి రాజ్యాంగంలోనా? ఎదురుపడితే నమస్కరించలేదని సామాన్య డ్రైవర్ ని చచ్చేలా కొడతారా? మొన్న నీ ఎమ్మెల్సీ ఓ దళిత డ్రైవర్ ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘటన మరువక ముందే మళ్ళీ ఇది’’ అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.