KTR: అందమైన హైదరాబాద్ ను దర్శించండి.. బీజేపీ నేతలకు కేటీఆర్ ఆహ్వానం
- మా అభివృద్దిని గమనించాలంటూ సూచన
- గ్రామాలకు వచ్చే బీజేపీ నేతలకు పథకాల గురించి చెబుతామన్న మంత్రి
- తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేయాలంటూ కామెంట్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ కు విచ్చేస్తున్న ఆ పార్టీ నేతలకు మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. ఈ నెల 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీ ముఖ్యులు విచ్చేస్తుండడం తెలిసిందే. రెండు రోజుల ఈ సమావేశాలు హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్నాయి.
‘‘రండి. అందమైన హైదరాబాద్ ను సందర్శించండి. సమస్య లేదు. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ రుచి చూడండి. ఇక్కడి అభివృద్ధి గమనించి మీ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నించండి’’అని కేటీఆర్ బీజేపీ నేతలకు సూచించారు.
‘‘బీజేపీ రెండు రోజుల సర్కస్ నిర్వహిస్తోంది. బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలే. ఒక్కో బీజేపీ నేత ఒక నియోజకవర్గానికి వస్తున్నాడు. రానీయండి. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ను వారు గమనిస్తారు. రైతు బంధు, రైతు బీమా గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఇంటికీ ఉన్న నీటి కనెక్షన్లు చూస్తారు. గ్రామాలకు వచ్చే బీజేపీ నేతలకు మా పథకాలు అన్నింటి గురించి వివరిస్తాం. జాతికి తెలంగాణ ప్రజలు అందిస్తున్న సేవలకు వారు సెల్యూట్ చేయాలి’’అని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో దర్శనీయ స్థలాల ఫొటోలను కూడా ట్విట్టర్ లో కేటీఆర్ తన పోస్ట్ తోపాటు ఉంచారు.