Maharashtra: శివసేన రెబెల్స్ నుంచి నాకూ ఆహ్వానం అందింది: సంజయ్ రౌత్
- గౌహతి నుంచి ఆహ్వానం అందిందన్న సంజయ్ రౌత్
- బాలా సాహెబ్ అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పానన్న ఎంపీ
- బాధ్యత కలిగిన పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యానని వెల్లడి
మహారాష్ట్రలో ఇటీవల నెలకొన్న రాజకీయ సంక్షోభంపై శివసేన ఎంపీ, ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూలదోసే దిశగా ఆ పార్టీకి చెందిన మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, మరికొందరు ఇండిపెండెంట్లతో కలిసి గౌహతిలో షిండే ఏకంగా ఓ శిబిరాన్నే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బల పరీక్షకు ముందు ఉద్ధవ్ థాకరే సీఎం పదవికి రాజీనామా చేయగా.. ఆ స్థానంలో షిండే మహారాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
తాజాగా శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన సంజయ్ రౌత్... ఏక్‌నాథ్ షిండే నుంచి తనకు కూడా ఆహ్వానం అందిందని వెల్లడించారు. గౌహతిలో ఉన్న సందర్భంగా షిండే వర్గం నుంచి తనకు ఆహ్వానం అందిందన్న రౌత్... తాను మాత్రం బాలా సాహెబ్ అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పినట్లు తెలిపారు. ఈ కారణంగానే తాను షిండే వర్గం ఆహ్వానాన్ని తిరస్కరించానని ఆయన వెల్లడించారు. ఇక శుక్రవారం జరిగిన తన ఈడీ విచారణపైనా ఆయన స్పందించారు. ఓ బాధ్యత కలిగిన పౌరుడిగా దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేస్తే విచారణకు హాజరయ్యానని ఆయన తెలిపారు. అవసరమనుకుంటే మరోమారు అయినా విచారణకు వస్తానని ఈడీ అధికారులకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.