Jagga Reddy: బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం

Jaggareddy fires on Revanth Reddy
  • హైదరాబాద్ వచ్చిన యశ్వంత్ సిన్హా
  • స్వయంగా స్వాగతం పలికిన కేసీఆర్
  • సిన్హాను కలిసిన వీహెచ్
  • మండిపడిన రేవంత్
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాదు పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలను బహిర్గతం చేసింది. యశ్వంత్ సిన్హా ఇవాళ హైదరాబాదు రాగా, సీఎం కేసీఆర్ స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. దాంతో, ఆయన రాక పక్కా ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో, ఒక్కరు తప్ప తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ సిన్హాను కలవలేదు. ఆ ఒక్కరు ఎవరంటే... వి.హనుమంతరావు. 

వీహెచ్... సిన్హాను కలవడంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే బండకేసి కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం కలవడం ఏంటి... ఇదేమైనా చిన్నపిల్లల వ్యవహారం అనుకుంటున్నారా? అంటూ వీహెచ్ పై మండిపడ్డారు. అయితే, రేవంత్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పుబట్టారు. 

యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతు పలికినప్పుడు వీహెచ్ వెళ్లి కలవడంలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. "అయినా రాహుల్ కు లేని అభ్యంతరం నీకెందుకు? నువ్వు బండకేసి కొడితే పడి ఉండడానికి మేం పాలేర్లమా? అసలు, బండకేసి కొట్టడానికి నువ్వెవరు? ఎవర్ని కొడతావు బండకేసి? వీహెచ్ వయసుతో పోలిస్తే నువ్వో పోరగాడివి"  అంటూ రేవంత్ పై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. 

టీపీసీసీ పదవి లేకపోతే రేవంత్ కు ఏమాత్రం విలువలేదని, రేవంత్ ను తొలగించాలంటూ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాస్తామని అన్నారు. రేవంత్ లేకపోయినా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తామని స్పష్టం చేశారు.
Jagga Reddy
Revanth Reddy
VH
Yashwant Sinha
CM KCR
Hyderabad
Congress
Telangana

More Telugu News