Congress: పార్టీ లైన్​ దాటిన జగ్గారెడ్డిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్​!

Congress high command planning issue notices jagga reddy for comments over revanth reddy
  • యశ్వంత్ సిన్హాను కలవొద్దన్న రేవంత్ పై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
  • పార్టీకి సమాచారం ఇవ్వకుండా సిన్హాకు స్వాగతం పలికిన వీహెచ్
  • ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో అధిష్ఠానం!
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. సిన్హా హైదరాబాద్ పర్యటనలో అధికార టీఆర్ఎస్ అన్నీ తానై వ్యవహరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట విమానాశ్రయంకు వెళ్లి సిన్హాకు స్వాగతం పలికారు. జలవిహార్లో ఏర్పాటు చేసిన పరిచయ సభకు తన కారులోనే తీసుకెళ్లారు. సిన్హాకు స్వాగతం పలికేందుకు నగరం మొత్తం టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు, కటౌట్లు పెట్టడంతో అది ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా మారిపోయింది. 

 హైదరాబాద్ వచ్చిన సిన్హా ముందుగా టీఆర్ఎస్ ను కలిస్తే ఆ కార్యక్రమంలో తాము పాల్గొనబోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుగానే స్పష్టం చేశారు. ఇది అధిష్ఠానం నిర్ణయమని, అలా కాకుండా ఎవరైనా సిన్హాను కలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రేవంత్ మాటలను పట్టించుకోని సీనియర్ నేత వి. హనుమంతరావు ఎయిర్ పోర్టుకు వెళ్లి సిన్హాకు స్వాగతం పలికారు.

మరోవైపు సిన్హాను ఎందుకు కలవడకూడదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీటిని రేవంత్ వర్గీయులు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. కొంతకాలం కిందట రాష్ట్ర పర్యటనలో భాగంగా గాంధీభవన్‌కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ లైన్‌ దాటి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని, పార్టీ నేతల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు.
 
దాంతో, జగ్గారెడ్డి కాస్త మెస్తబడ్డారు. అప్పటిదాకా రేవంత్ ను తరచూ విమర్శించే ఆయన రాహుల్ పర్యటన తర్వాత ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, సిన్హా పర్యటన నేపథ్యంలో శనివారం రేవంత్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. దాంతో, పార్టీ లైన్ దాటిన జగ్గారెడ్డిపై  క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జితో పాటు రాజకీయ సలహాదారుగా ఉన్న సునీల్‌ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు సమాచారం.

పార్టీకి సమాచారం ఇవ్వకుండా యశ్వంత్‌ సిన్హాకు బేగంపేట ఎయిర్‌పోర్టులో టీఆర్‌ఎస్‌తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్‌ నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Congress
TPCC President
Revanth Reddy
Jagga Reddy
VH
notice
action
Yashwant Sinha
KCR
Rahul Gandhi

More Telugu News