Maharashtra: షిండే ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుంది.. మధ్యంతర ఎన్నికలు ఖాయం అంటున్న శరద్ పవార్
- ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు చెప్పిన పవార్
- ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశం
- నేడు షిండే ప్రభుత్వానికి బల పరీక్ష
బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఎంతోకాలం అధికారంలో ఉండరని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఆరు నెలల్లో షిండే ప్రభుత్వం పడిపోతుందని, మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ, ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి మహా వికాస్ అఘాడి కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ, ఈ కూటమి ఎంతో కాలం నిలువలేదు.
ఇప్పుడు బీజేపీతో కలిసి షిండే ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం కూడా రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని పవార్ అంటున్నారు. ఆరు నెలల్లో ఈ కూటమి పతనం అవుతుందని, మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ముంబైలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పవార్ పార్టీ నేతలకు సూచించారు.
ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఇస్తున్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని పవార్ చెప్పారు. ఒకసారి మంత్రి వర్గాన్ని ప్రకటించి శాఖలు కేటాయిస్తే వారి అశాంతి బయటపడుతుందని, ఇది చివరికి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది పవార్ పేర్కొన్నారు. బీజేపీతో జట్టు కట్టి చేసిన తమ ‘ప్రయోగం’ విఫలమైన తర్వాత అసమ్మతి ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు ఆరు నెలల సమయం మాత్రమే ఉన్నదని ఎన్సీపీ శాసనసభ్యులకు చెప్పారు. తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాలల్లోనే ఎక్కువ సమయం గడపాలని వారికి ఆయన సూచించారు.
కాగా, మహావికాస్ అఘాడి ప్రభుత్వం పతనం తర్వాత జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకనాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. మరోవైపు సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి బలపరీక్ష జరగనుంది. విశ్వాస పరీక్షకు ముందు బీజేపీ నేత రాహుల్ నార్వేకర్ స్పీకర్ గా ఎన్నికయ్యారు. అనంతరం శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను స్పీకర్ తిరిగి నియమించి ఉద్ధవ్ థాకరే వర్గానికి షాకిచ్చారు.