Team India: కోహ్లీ ఔటైన బంతికి ప్రపంచంలో ఎవ్వరూ వికెట్ కాపాడుకోలేరు: ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్
- విరాట్ పై భారత కామెంటేటర్లు కఠినంగా మాట్లాడుతున్నారన్న గ్రేమ్ స్వాన్
- ఇంగ్లండ్ తో రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులకే ఔటైన కోహ్లీ
- తొలి ఇన్నింగ్స్ లోనూ నిరాశ పరిచిన భారత మాజీ కెప్టెన్
- ఆ బంతిని ఎదుర్కొని నిలబడగలిగితే అతను చాలా అదృష్టవంతుడన్న గ్రేమ్
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ నిరాశ పరిచిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్ తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులే చేశాడు. తాజాగా రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగుల వద్ద ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
దీనిపై విమర్శకులతో పాటు భారత్ కు చెందిన పలువురు కామెంటేటర్లు పెదవి విరిచారు. శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన విరాట్ పై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే, కోహ్లీకి ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ బాసటగా నిలిచాడు. స్టోక్స్ బౌలింగ్ లో కోహ్లీ ఔటైన బంతిని ఈ ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా ఆడలేడని అన్నాడు. విరాట్ విషయంలో భారత కామెంటేటర్లే కాస్త అతిగా వ్యవహరిస్తున్నారని, కఠినంగా ఉంటున్నారని అభిప్రాయపడ్డాడు.
‘మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. దాన్ని నేను పట్టించుకోను. కానీ, టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరైనా అలాంటి బంతిని ఎదుర్కొని నిలబడగలిగితే అతను చాలా అదృష్టవంతుడు అవుతాడు. మా ఇంగ్లండ్ వైపు నుంచి చూస్తే భారత కామెంటేటర్లు కోహ్లీ గురించి మాట్లాడినప్పుడల్లా చాలా కఠినంగా ఉంటున్నారని అనుకుంటున్నా. విరాట్ ఎంతో నాణ్యమైన ఆటగాడు. ఈ రోజు తను క్రీజులో ఉన్నంతసేపు మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు’ అని స్వాన్ పేర్కొన్నాడు.