Hyderabad: హైదరాబాద్ నగర పేరు మార్పుపై కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఏమన్నారంటే...!
- హైదరాబాదులో ముగిసిన బీజేపీ సమావేశాలు
- హైదరాబాద్ ను భాగ్యనగర్ గా పిలిచిన మోదీ
- రాజకీయ వర్గాల్లో చర్చ
- బీజేపీ అధికారంలోకి వస్తే ఆలోచిస్తామన్న గోయల్
ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హైదరాబాద్ పేరును భాగ్యనగర్ అని పేర్కొనడం తెలిసిందే. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, హైదరాబాద్ నగరం పేరును భాగ్యనగర్ గా మార్చుతారా...? అంటూ కేంద్రమంత్రి పియూష్ గోయల్ ను మీడియా ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అంశంపై ఆలోచిస్తాం. దీనిపై క్యాబినెట్ సహచరులతో చర్చించిన పిదప మా సీఎం నిర్ణయం తీసుకుంటారు" అని వివరించారు.
హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చాలని బీజేపీ నేతల నుంచి ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే అంశం ప్రస్తావించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్ గా మార్చాలంటే బీజేపీకి ఓటేయాలని యోగి గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.