Prime Minister: మోదీ హెలికాప్టర్‌కు అత్యంత సమీపంలో బెలూన్లు... ఆందోళన రేకెత్తించిన ఘటన వీడియో ఇదిగో
- మోదీకి నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ యత్నం
- మోదీ హెలికాప్టర్ గాల్లోకి లేచిన వెంటనే బెలూన్లు వదిలిన కాంగ్రెస్ నేత రాజీవ్ రతన్
- ఆ వెంటనే పరారైపోయిన నేత
- రాజీవ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్న ఏపీ పోలీసులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఆదివారం జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రాంగణంలోకి అనుమతి లేకుండానే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి, మరో వ్యక్తి ప్రవేశించిన వైనంపై కలకలం రేగగా... తాజాగా సోమవారం గన్నవరం విమానాశ్రయం నుంచి భీమవరం వెళ్లేందుకు మోదీ ఎక్కిన హెలికాప్టర్ గాల్లో ఉండగానే... దానికి అత్యంత సమీపంలోకి బెలూన్లు ఎగురుతూ వచ్చాయి.
మోదీ హెలికాప్టర్‌కు అత్యంత సమీపంలోకి వచ్చిన ఈ బెలూన్లను చూసిన ఎస్పీజీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే ఆ బెలూన్లు మరింతగా దగ్గరకు వచ్చేలోగానే మోదీ హెలికాప్టర్ భీమవరం దిశగా దూసుకుపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీకి అన్యాయం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు మోదీకి నిరసన తెలిపేందుకే ఇలా చేశారని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఎస్పీజీ కమాండోల ఆదేశాలతో క్షణాల్లో రంగంలోకి దిగిపోయిన ఏపీ పోలీసులు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ రతన్ అనే నేత ఈ ఘటనకు కారకుడని తేల్చారు.
అయితే మోదీకి వ్యతిరేకంగా బెలూన్లు వదిలిన రాజీవ్ మాత్రం ఆ వెంటనే పరారయ్యారు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఎలా అంటూ ఎస్పీజీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై లోతుగా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.