YSRCP: మోదీకి వీడ్కోలు వినతి పత్రంలో జగన్ ప్రస్తావించిన అంశాలివే!
- ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలన్న జగన్
- పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని వినతి
- రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ కింద రూ.34,125 కోట్లు ఇవ్వాలని అభ్యర్థన
- తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించాలన్న ఏపీ సీఎం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని భీమవరంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహావిష్కరణ కోసం సోమవారం ఏపీకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిల్లీకి తిరుగు పయనం అవుతున్న సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ వినతి పత్రం అందించిన విషయం తెలిసిందే. ఈ వినతి పత్రంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకునే దిశగా మరింత మేర సాయం చేయాలంటూ ఆ వినతి పత్రంలో మోదీని జగన్ కోరారు.
జగన్ తన వినతి పత్రంలో ఇంకా ఏఏ అంశాలను ప్రస్తావించారన్న విషయానికి వస్తే.. రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందన్న జగన్... ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు గాను రీసోర్స్ గ్యాప్ గ్రాంట్ కింద రూ.34,125 కోట్లను విడుదల చేయాలని మోదీని కోరారు. అదే విధంగా పోలవరం సవరించిన అంచనాలు రూ.55548 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధానిని జగన్ కోరారు. ఏపీకి తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ.6,627 కోట్లను ఇప్పించాలని కోరారు. కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలకు తగినంత మేర ఆర్ధిక సాయం చేయాలని జగన్ కోరారు.