Women: అగ్నిపథ్ స్కీం ద్వారా భారత నేవీకి దరఖాస్తు చేసుకున్న 10 వేల మంది యువతులు
- ఇటీవల అగ్నిపథ్ స్కీం తీసుకువచ్చిన కేంద్రం
- సైన్యంలోకి నాలుగేళ్ల ప్రాతిపదికన అగ్నివీరులు
- దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు
- ఏమాత్రం వెనక్కితగ్గని కేంద్రం
- నోటిఫికేషన్లు ఇచ్చిన త్రివిధ దళాలు
భారత త్రివిధ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ఇటీవల అగ్నిపథ్ స్కీంను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో నిరసనజ్వాలలు చెలరేగినప్పటికీ కేంద్రం వెనక్కితగ్గలేదు. అగ్నిపథ్ విధానం ద్వారా నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో, ఇటీవల భారత నేవీలోనూ అగ్నిపథ్ కింద నియామకాలకు ఉద్యోగ ప్రకటన జారీ చేయగా, విశేష స్పందన వస్తోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అగ్నిపథ్ స్కీం ద్వారా భారత నేవీ ఉద్యోగాల కోసం దాదాపు 10 వేల మంది యువతులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. నేవీ ప్రకటన విడుదలైన వారం రోజుల్లోనే ఇంత భారీ ఎత్తున స్పందన రావడం విశేషం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక జులై 15 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఏడాది భారత నేవీ 3 వేల మంది అగ్నివీరులను తీసుకోనుంది. వారిలో ఎంతమంది మహిళలను ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.