Edgbaston cricket ground: టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత ప్రేక్షకుల పట్ల జాతి వివక్ష
- వెకిలి దూషణలకు దిగిన ఇంగ్లండ్ జాతీయులు
- భారత అభిమానులకు చేదు అనుభవం
- స్టేడియం సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం సున్నా
- విచారణ చేస్తున్నట్టు ఈసీబీ ప్రకటన
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఐదో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. భారత వీక్షకులు జాతి వివక్షను ఎదుర్కొన్న అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ఎడ్జ్ బాస్టన్ క్రికెట్ మైదానం అధికారులు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ విచారణ నిర్వహిస్తున్నాయి.
మైదానంలోని బ్లాక్ 22 ఎరిక్ హోలీస్ వద్ద కూర్చున్న భారత అభిమానులను చూసి ఇంగ్లండ్ జాతీయులు కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్రీ... పాకి.... అంటూ వెకిలి దూషణలకు దిగారు. దీన్ని భారత అభిమానులు అక్కడే ఉన్న మైదానం స్టివార్డ్ లకు తెలియజేసి, తమను దూషించిన వారిని చూపించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ‘మీ స్థానాల్లో మీరు కూర్చుని చూడండి’ అని వారు ఉచిత సలహా పడేశారు.
ఈ విషయాన్ని పలువురు ట్విట్టర్ వేదికగా వెలుగులోకి తీసుకొచ్చారు. భారత్ ఆర్మీ అనే ఈవెంట్ ఆర్గనైజర్ ఈ అంశంలో అధికారులతో సంప్రదింపులు చేస్తోంది. మన సభ్యులు చాలా మంది కేవలం కొద్ది మంది చేతిలో జాత్యహంకార వేధింపులకు గురి కావడం దురదృష్టకరమని భారత్ ఆర్మీ పేర్కొంది. వేధింపుల సమయంలో తమ పిల్లలు, ఆడవారి విషయంలో ఆందోళన చెందినట్టు బాధితులు పేర్కొన్నారు.
‘‘ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. మీకు ఎదురైన చేదు అనుభవాలకు చింతిస్తున్నాం. ఎడ్జ్ బాస్టన్ మైదానం అధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నాం’’ అంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటన విడుదల చేసింది.