Baahubali producer: ఆర్ఆర్ఆర్ ‘గే’ లవ్ స్టోరీ అంటూ ఆస్కార్ అవార్డు గ్రహీత వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన శోభు యార్లగడ్డ
- ఆర్ఆర్ఆర్ మూవీ గే లవ్ స్టోరీ కాదన్న శోభు
- ఒకవేళ అయినా అందులో తప్పేముందని ప్రశ్న
- మీలాంటి వారి ఉద్దేశ్యాలు ఇంత దిగజారుతాయని అనుకోలేదంటూ కామెంట్
- సీరియస్ గా తీసుకోవద్దంటూ రేసుల్ పోకొట్టి జవాబు
ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన సౌండ్ ఇంజనీర్ రేసుల్ పోకొట్టి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలతో అగ్గి రాజేశారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లతో రాజమౌళి ఈ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలను జూనియర్ ఎన్జీఆర్, రామ్ చరణ్ పోషించారు.
ఈ క్రమంలో, ఆర్ఆర్ఆర్ సినిమా ఒక గే లవ్ స్టోరీ (స్వలింగ సంపర్కులు) అంటూ రేసుల్ సోమవారం వ్యాఖ్యానించారు. నటుడు, రచయిత మునీష్ భరద్వాజ్ ట్వీట్ కు స్పందనగా ఆయన ఇలా వ్యాఖ్యానించారు. దీనిపై బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘‘మీరు చెప్పినట్టు ఆర్ఆర్ఆర్ సినిమా ఒక గే లవ్ స్టోరీ అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అయినా అందులో తప్పు ఏముంది? మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? మీ లాంటి వారి ఉద్దేశ్యాలు ఇంతలా దిగజారడం పట్ల తీవ్ర నిరాశ చెందాను’’ అని శోభు యార్లగడ్డ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
దీనికి రేసుల్ స్పందించాడు. ఆర్ఆర్ఆర్ ను గే లవ్ స్టోరీ అంటూ వచ్చిన ఒక ఆర్టికల్ ను ప్రస్తావించాడు. ‘‘మీతో ఏకీభవిస్తున్నాను. ఒకవేళ ఇది నిజమే అయినా అందులో తప్పేమీ లేదు. నా ఫ్రెండ్ ను కోట్ చేశానంతే. దీన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎవరికీ నేరాన్ని ఆపాదించదలుచుకోలేదు’’ అని రేసుల్ పేర్కొన్నాడు.