Techie: ఓటీపీ విషయంలో గొడవ... చెన్నైలో టెక్కీని చంపేసిన ఓలా క్యాబ్ డ్రైవర్
- బంధువుల ఇంటికి వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్
- సినిమా చూసి ఇంటికి వెళ్లే సమయంలో గొడవ
- ఓటీపీ విషయంలో గందరగోళం
- టెక్కీ, క్యాబ్ డ్రైవర్ మధ్య గొడవ
- పిడిగుద్దులు కురిపించిన క్యాబ్ డ్రైవర్
చెన్నైలో దారుణం జరిగింది. ఓటీపీ విషయంలో గొడవ ముదిరి ఓ టెక్కీ ప్రాణం పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.... ఉమేంద్ర ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కోయంబత్తూరులో ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. అయితే వారాంతంలో చెన్నైలోని బంధువుల ఇంటికి తన కుటుంబంతో సహా వచ్చాడు. భార్యాబిడ్డలతో కలిసి ఆదివారం నాడు ఓ మాల్ లో సినిమా చూశాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఉమేంద్ర భార్య ఓలా క్యాబ్ బుక్ చేసింది.
వారు ఉన్న ప్రదేశానికి క్యాబ్ రాగా, ఓటీపీ విషయంలో గందరగోళం ఏర్పడింది. ఉమేంద్ర సరైన ఓటీపీ చెప్పలేదంటూ వారి కుటుంబాన్ని కారు దిగాల్సిందిగా క్యాబ్ డ్రైవర్ స్పష్టం చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమేంద్ర కారు డోర్ ను విసురుగా వేశాడు. ఈ పరిణామం కారు డ్రైవర్ ను తీవ్ర ఆవేశానికి గురిచేసింది. వెంటనే కారు దిగి ఉమేంద్రపై పిడిగుద్దులు కురిపించాడు. దాంతో ఆ టెక్కీ అక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. ఓ పోలీసు అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ, తొలుత క్యాబ్ డ్రైవరే ఉమేంద్ర వైపు ఫోన్ విసిరేశాడని, ఆపై దాడి చేశాడని వెల్లడించారు. ఉమేంద్ర మృతికి కారకుడైన ఆ క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని, అతడిపై హత్య అభియోగాలు నమోదు చేశామని వివరించారు.