Mumbai: భారీ వర్షాలకు ముంబయి మహానగరం అతలాకుతలం
- నిన్నటి నుంచి ముంబయిలో జోరువాన
- పలు ప్రాంతాలు జలమయం
- పరిస్థితి సమీక్షించిన సీఎం ఏక్ నాథ్ షిండే
- 3,500 మందిని తరలించిన అధికారులు
గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబయి అతలాకుతలమైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 24 గంటల్లో ముంబయిలోనూ, నగర శివారు ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
ఈ నేపథ్యంలో, 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సీఎం ఏక్ నాథ్ షిండే వెల్లడించారు. నగరంలో వర్షాల పరిస్థితిని షిండే సమీక్షించారు. బీఎంసీ పరిధిలో వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ అధికార యంత్రాంగాన్ని మోహరించారు. భారీగా నీరు నిలిచిపోవడంతో ఖార్, అంధేరీ సబ్ వేలు మూసివేశారు. శాంతాక్రజ్, మంఖుర్ద్ రైల్వే స్టేషన్ల వద్ద రైళ్లరాకపోకలు నిదానించాయి.