Chennai: పెరుగుతున్న కరోనా కేసులు.. కొరడా ఝళిపించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్!
- మాస్క్ కచ్చితంగా ధరించాలన్న చెన్నై మున్సిపల్ కార్పొరేషన్
- మాస్క్ లేని వారికి రూ. 500 జరిమానా
- అందరూ భౌతికదూరం పాటించాలని ఆదేశం
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని వారికి రూ. 500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్నందువల్లే మాస్క్ నిబంధనను తప్పనిసరి చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మాస్క్ ధరించడంతో పాటు... బహిరంగ ప్రదేశాల్లో అందరూ భౌతికదూరాన్ని పాటించాలని ఆదేశించింది. కొనుగోలుదారులను ఒకేసారి పెద్ద సంఖ్యలో అనుమతించవద్దని మాల్స్, వాణిజ్య సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. మాల్స్, థియేటర్స్, వస్త్ర దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పని చేసేవారు మాస్క్ కచ్చితంగా ధరించాలని చెప్పింది. మాస్క్ లేనివారికి తమిళనాడు ప్రజా ఆరోగ్య చట్టం 1939 ప్రకారం రూ. 500 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అనవసరంగా బయట తిరగడాన్ని తగ్గించుకోవాలని చెప్పింది.