Maharashtra: అందుకే థాకరే ప్రభుత్వంపై ఎదురు తిరగాల్సి వచ్చింది: మహారాష్ట్ర సీఎం షిండే
- దావూద్ ఇబ్రహీం విషయంలో ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న షిండే
- నియోజకవర్గాల్లో అభివృద్దికి నిధులు లేక ఇబ్బందులు పడ్డామని వెల్లడి
- ఉద్ధవ్ కు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని వ్యాఖ్య
మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని అన్నారు. 2019 లో తాము బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే... కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దాని కారణంగా, హిందుత్వ, సావర్కర్, ముంబై బాంబు పేలుళ్లు, దావూద్ ఇబ్రహీం, ఇతర సమస్యలు వచ్చినప్పుడు తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయామని షిండే చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఓ ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికల్లో తమ చేతిలో ఓడిన వారికి మిత్రపక్షాలు అధికారం కట్టబెట్టే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. దాంతో, తమ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పనులు చేయడంలో ఇబ్బంది పడ్డారన్నారు. నిధులు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని, ఈ విషయంపై అధిష్ఠానంతో మాట్లాడినా ఫలితం లేకపోయిందని అన్నారు. అందుకే 40-50 మంది ఎమ్మెల్యేలు థాకరే ప్రభుత్వంపై ఎదురు తిరగాల్సి వచ్చిందన్నారు.
ఈ విషయంలో మాజీ సీఎం ఉద్ధవ్ థాకరేపై షిండే విరుచుకుపడ్డారు. ‘మహా వికాస్ అఘాడి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం లేదని మేము చాలాసార్లు ఉద్ధవ్ థాకరేతో చర్చలు జరిపాం. మా పార్టీ సీఎం ఉన్నప్పటికీ.. నగర పంచాయతీ ఎన్నికల్లో మేం నాలుగో స్థానానికి పడిపోయాం. పరిస్థితిని ఉద్ధవ్ కు వివరించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది’ అని చెప్పుకొచ్చారు.
సామాన్య ప్రజలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే తాము బెంజ్ కారు (అఘాడి కూటమి)ను వెనక్కినెట్టి ఆటో (బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం)ను ముందుకు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇది తమ ప్రభుత్వమని భావించే విధంగా పని చేస్తామని స్పష్టం చేశారు. తమది బలమైన ప్రభుత్వమని షిండే అన్నారు. చట్ట విరుద్ధంగా అధికారంలోకి రాలేదన్నారు. మెజారిటీ ఉంది కాబట్టే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ప్రధాని మోదీ సూచించారని షిండే వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు తాను కూడా అండగా ఉంటానని పీఎం హామీ ఇచ్చారని తెలిపారు.