Boris Johnson: ఇద్దరు మంత్రుల రాజీనామా.. ఇబ్బందుల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సర్కారు
- రాజీనామా చేసిన రిషి సునాక్, సాజిద్ జావెద్
- బోరిస్ ప్రభుత్వం సరైన రీతిలో పాలన సాగించడం లేదన్న మంత్రులు
- బోరిస్ సామర్థ్యంపై నమ్మకం పోయిందన్న జావెద్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికార పీఠం కుదుపుకు గురవుతోంది. ఆయన భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో ఆయన ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతున్నాయి. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావెద్ లు తమ పదవులకు రాజీనామా చేశారు.
బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ప్రభుత్వం సరైన రీతిలో పాలన సాగించడం లేదని రాజీనామా చేసిన మంత్రులిద్దరూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిషి సునాక్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని వీడటం బాధగా ఉన్నప్పటికీ, తప్పడం లేదని అన్నారు. ప్రభుత్వం సమర్థవంతంగా, సరైన విధానంలో నడవాలని ప్రజలు కోరుకుంటారని, పోటీతత్వంతో ఇతర దేశాలతో పోటీ పడేలా ఉండాలని భావిస్తారని, కానీ అలా జరగడం లేదని చెప్పారు. ఇదే తన చివరి మంత్రి పదవి అని ఆయన అన్నారు.
బోరిస్ సామర్థ్యంపై తనకు నమ్మకం పోయిందని జావెద్ చెప్పారు. ఆయన నాయకత్వంలో పరిస్థితులు మారవని అన్నారు. కరోనా వేళ కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కి బోరిస్ జాన్సన్ పార్టీలు నిర్వహించారు. దీంతో, ఆయన సర్వత్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే మంత్రులు రాజీనామా చేసినా తగ్గేదే లేదంటున్నారు బోరిస్ జాన్సన్. కొత్త కేబినెట్ ను విస్తరిస్తానని ఆయన అంటున్నారు.