China: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొన్నిచోట్ల లాక్​ డౌన్​ మొదలు

chinas new covid outbreaks put millions under lockdown
  • చారిత్రక షియాన్ నగరంలో కఠిన ఆంక్షలు
  • ప్రజలకు నిత్యావసరాల సరఫరా కోసం ఏర్పాట్లు
  • త్వరలోనే పూర్తిస్థాయి లాక్ డౌన్!
  • ఇప్పుడిప్పుడే బీజింగ్, షాంఘై నగరాల్లో ఆంక్షల నుంచి ఉపశమనం
  • ఒమిక్రాన్ బీఏ 5.2 సబ్ వేరియంట్ విస్తరిస్తున్నట్టు అధికారుల వెల్లడి
చైనాలో బుధవారం మరో 300 కరోనా కేసులు నమోదైనట్టు ఆ దేశ అధికారులు ప్రకటించారు. అందులో చైనా ఉత్తర ప్రాంతంలోని చారిత్రక, పర్యాటక నగరమైన షియాన్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. ఆ దేశం మళ్లీ కఠిన ఆంక్షలు విధించింది. చైనాకు వచ్చే పర్యాటకుల్లో చాలా మంది ఈ నగరానికి వచ్చి సందర్శిస్తుంటారు. అలాంటి చోట అత్యవసరాలు, నిత్యావసర సరుకులు అమ్మే షాపులు మినహా మిగతా వాణిజ్య సంస్థలన్నింటినీ బుధవారం రాత్రి నుంచి మూసేయాలని అధికారులు ఆదేశించారు. 

రోజూ లక్షల కొద్దీ టెస్టులు
చైనాలో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదవకూడదన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం అత్యంత భారీ స్థాయిలో కరోనా టెస్టులు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని నెలల కింద బీజింగ్ లో భారీగా కేసులు రావడంతో కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. దాని తర్వాత షాంఘై నగరం కూడా లాక్ డౌన్ లోకి వెళ్లగా.. ఇప్పుడిప్పుడే ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా షియాన్ నగరంలో కేసులు నమోదయ్యాయి. దీనితో థియేటర్లు, పబ్బులు, బార్లు, ఇంటర్నెట్ కేఫ్లు, ఇతర జనం గుమిగూడే వాణిజ్య సముదాయాలను మూసేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని.. అంటే పూర్తి స్థాయి లాక్ డౌన్ కు రంగం సిద్ధమవుతున్నట్టేనని స్థానికులు చెబుతున్నారు. 

బీఏ 5.2 వేరియంట్ వల్లే..
చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ నుంచి పుట్టిన బీఏ 5.2 సబ్ వేరియంట్ విస్తరిస్తోందని అక్కడి అధికారులు అంటున్నారు. ఇది మామూలు ఒమిక్రాన్ కన్నా చాలా వేగంగా విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. ఈ క్రమంలో భారీ ఎత్తున టెస్టులు, ట్రేసింగ్ చేయడం మొదలుపెట్టినట్టు చైనా అధికారులు ప్రకటించారు.
China
COVID19
Corona Virus
Lockdown
Xian City

More Telugu News