Congress: యూపీలో కాంగ్రెస్‌కు షాక్...చరిత్రలో తొలిసారి మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన జాతీయ పార్టీ
- పార్టీ ఏకైక ఎమ్మెల్సీ దీపక్ పదవీకాలం పూర్తి
- గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లలోనే గెలుపు
- ఇప్పట్లో శాసన మండలిలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం కష్టమే
దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయింది. అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ అంసెబ్లీ ఎన్నికల్లోనూ రెండు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది.
తాజాగా ఆ రాష్ట్ర శాసన మండలిలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కోల్పోయింది. 110 ఏళ్ల యూపీ శాసన మండలి చరిత్రలో కాంగ్రెస్‌కు ఇలా జరగడం ఇదే తొలిసారి. యూపీ శాసన మండలిలో కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం ఏకైక సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ దీపిక్ సింగ్ పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్సీలు కూడా తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.
1887లో యూపీ శాసన మండలి ఏర్పాటైంది. 1909లో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ తరఫున తొలి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. ఆ తర్వాత యూపీలో పలుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... మెజారిటీ పార్లమెంటు సీట్లు కూడా గెలుచుకుంది. కానీ, గత రెండు పర్యాయాలు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అత్యంత చేదు ఫలితాలు వచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాంతో, ఇప్పట్లో యూపీ శాసన మండలిలో కాంగ్రెస్‌కు తిరిగి ప్రాతినిధ్యం దక్కడం కష్టమే.