Ushasree Charan: ఏపీ మంత్రి ఉషశ్రీపై భూకబ్జా ఆరోపణలతో పిటిషన్.. విచారణకు స్వీకరించిన హైకోర్టు!
- కళ్యాణదుర్గంలో 100 ఎకరాల చెరువును కబ్జా చేశారంటూ పిటిషన్
- ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు యత్నిస్తున్నారన్న పిటిషనర్
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ పై భూకబ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కళ్యాణదుర్గంలో 100 ఎకరాల చెరువును కబ్జా చేశారంటూ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. చెరువును పూడ్చి, ప్లాట్లుగా మార్చి, అమ్ముకునేందుకు యత్నిస్తున్నారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.
దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేసినా, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సర్వే నంబర్ 329లో వంద ఎకరాల సుబేదార్ భూమిని ఉషశ్రీ కబ్జా చేశారని అన్నారు. పిటిషన్ లో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.