YSRCP: ఇడుపులపాయకు వైఎస్ జగన్... విజయమ్మ, షర్మిలతో కలిసి రాత్రికి అక్కడే బస
- కడప జిల్లా టూర్లో ముఖ్యమంత్రి జగన్
- ఇడుపులపాయ చేరుకున్న విజయమ్మ, షర్మిల
- రేపు ఉదయం వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించనున్న వైనం
- వైసీపీ ప్లీనరీకి విజయమ్మ హాజరవుతారా? అన్న అంశంపై విశ్లేషణలు
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కడప జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తన సొంత నియోజకవర్గం పులివెందుల, వేంపల్లె మండలాల్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న జగన్ రాత్రికి ఇడుపులపాయలో తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఎస్టేట్‌కు చేరుకోనున్నారు. రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద జగన్ నివాళులు అర్పిస్తారు.
ఇదిలా ఉంటే... గురువారం సాయంత్రానికే జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలలు ఇడుపులపాయ చేరుకున్నారు. గురువారం రాత్రి వారు జగన్‌తో కలిసి ఇడుపులపాయ ఎస్టేట్‌లోనే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం జగన్‌తో కలిసి వారు వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి అర్పించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత గుంటూరులో ప్రారంభం కానున్న వైసీపీ ప్లీనరీకి జగన్ బయలుదేరతారు. అదే సమయంలో షర్మిల హైదరాబాద్ బయలుదేరతారు. వైసీపీ ప్లీనరీ నేపథ్యంలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? అన్న దిశగా ఆసస్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.