Lalan Kumar: కరోనా వేళ కాలేజీల మూత... 33 నెలల జీతం వెనక్కి ఇచ్చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్
- బీహార్ లో 2019లో ఉద్యోగంలో చేరిన లలన్ కుమార్
- కొన్ని నెలలకే దేశంలో కరోనా సంక్షోభం
- దీర్ఘకాలం పాటు లాక్ డౌన్లు
- విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోయానన్న లలన్
- రూ.24 లక్షల జీతం వెనక్కి ఇచ్చేసిన వైనం
బీహార్ కు చెందిన లలన్ కుమార్ హిందీ భాషా అసిస్టెంట్ ఫ్రొఫెసర్. ముజఫర్ పూర్ లోని ఓ కాలేజీలో 2019లో ఉద్యోగంలో చేరారు. ఆయనకు నెలకు రూ.80 వేల వరకు జీతం వస్తుంది. కాగా, లలన్ కుమార్ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే దేశంలో కరోనా వ్యాప్తి మొదలవడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. లాక్ డౌన్ల ప్రభావంతో దేశంలోని అన్ని రంగాలతో పాటు విద్యారంగం కూడా కుంటుపడింది.
ఈ నేపథ్యంలో, లలన్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 33 నెలల జీతాన్ని వెనక్కి ఇచ్చేశారు. కరోనా వ్యాప్తి వల్ల తాను పనిచేస్తున్న విద్యాసంస్థ కూడా మూతపడిందని, తను విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోయానని ఆయన తెలిపారు. ఆన్ లైన్ లో బోధన జరిగినా, దానివల్ల ఎక్కువమందికి ప్రయోజనం లభించలేదని పేర్కొన్నారు. అందుకే, కరోనా వ్యాప్తి సమయంలో తాను జీతం రూపంలో పొందిన రూ.24 లక్షలను వెనక్కి ఇచ్చేస్తున్నానని లలన్ కుమార్ ప్రకటించారు.
తాను కాలేజీలో చేరిన తర్వాత కొన్నినెలలలోనే కరోనా సంక్షోభం వచ్చిందని, ఒక్కరోజు కూడా సరిగా పాఠాలు చెప్పలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. పాఠాలు చెప్పకుండా జీతం తీసుకోవడానికి తన మనస్సాక్షి అంగీకరించడంలేదని నిజాయతీని ప్రదర్శించారు. ఈ క్రమంలో తన జీతాన్ని చెక్కు రూపంలో అధికారులకు తిరిగిచ్చేశారు.
కాగా, లలన్ కుమార్ చర్యపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే, మరోవైపు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లలన్ కుమార్ కొన్నాళ్ల కిందట పీజీ విభాగానికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈ ఎత్తుగడకు పాల్పడ్డాడని అతడు పనిచేస్తున్న కాలేజీ ప్రిన్సిపల్ ఆరోపిస్తున్నారు.