ED: స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో సగం ఆదాయాన్ని చైనాకు చేరవేసింది: ఈడీ వెల్లడి

ED blocks VIVO bank accounts

  • వివోపై మనీలాండరింగ్ కేసు
  • రెండ్రోజుల కిందట 44 ప్రాంతాల్లో సోదాలు
  • తాజాగా 119 బ్యాంక్ అకౌంట్ల స్తంభన
  • పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివోపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా వివో సంస్థకు చెందిన 119 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. ఈ ఖాతాలకు అనుబంధంగా రూ.465 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉండగా, ఈ ఖాతాల్లో రూ.73 లక్షల నగదు, 2 కిలోల బంగారు కడ్డీలు గుర్తించారు. 

కాగా, వివో తన ఆదాయంలో 50 శాతాన్ని (రూ.62,476 కోట్లు) చైనాలోని తన మాతృసంస్థకు చేరవేసిందని ఈడీ వెల్లడించింది. భారత్ లో భారీగా పన్నులు ఎగవేయడానికే ఈ విధంగా ఆదాయ తరలింపు చేపట్టిందని ఆరోపించింది. భారత్ లో తమకు విపరీతమైన నష్టాలు వచ్చాయని, అందుకే పన్నులు చెల్లించలేకపోతున్నామని చూపడానికే ఈ తరలింపులు జరిగాయని ఈడీ వివరించింది. 

కాగా, వివో, దాని అనుబంధ సంస్థలపై ఈడీ రెండ్రోజుల కిందట సోదాలు నిర్వహించింది. దేశంలోని 44 ప్రాంతాల్లో మనీలాండరింగ్ చట్టం కింద ఈ సోదాలు జరిపింది. 

ఇటీవల, తమ గుర్తింపు పత్రాలను కొందరు చైనా వాటాదారులు ఫోర్జరీ చేశారంటూ జమ్మూ కశ్మీర్ కు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఆరోపణల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేసింది. ఇటీవల కొంతకాలంగా చైనా వ్యాపార సంస్థలపై భారత కేంద్ర ప్రభుత్వం నిశితంగా దృష్టి సారించింది.

  • Loading...

More Telugu News