Chhattisgarh: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం!
- ఆగ్నేయ మధ్య రైల్వేలో తొలిసారి చిన్న వయసులోనే కారుణ్య నియామకం
- 18 ఏళ్లు నిండాక ఉద్యోగంలో చేరనున్న బాలిక
- జూన్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారి
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల బాలిక రాధికకు రైల్వే అధికారులు ఉద్యోగమిచ్చారు. అత్యంత అరుదైన ఈ కారుణ్య నియామకం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఆగ్నేయ మధ్య రైల్వేలో జరిగింది. చిన్నారికి ఉద్యోగానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను బుధవారమే అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా రాధిక వేలి ముద్రలు సేకరించారు.
ఇక చిన్నారికి 18 ఏళ్లు నిండాక ఉద్యోగంలో చేరేందుకు అర్హురాలు అవుతుంది. ఆగ్నేయ మధ్య రైల్వే చరిత్రలోనే ఈ నియామకం ప్రత్యేకమైనదని, ఇంత చిన్న వయసులో కారుణ్య నియామకం ఓ రికార్డని అధికారులు తెలిపారు.
రాధిక తండ్రి రాజేంద్ర కుమార్ యాదవ్ రైల్వే ఉద్యోగి. జూన్ 1న కుటుంబంతో కలిసి భిలాయ్ వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రకుమార్, ఆయన భార్య ప్రాణాలు కోల్పోగా రాధిక ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి ఆపన్నహస్తం అందించిన రైల్వే, అందులో భాగంగా కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చింది.