Eyes: కంటిచూపు తగ్గుతోందా...? అయితే ఈ రెండు విటమిన్ల లోపం కూడా కారణం కావొచ్చు!
- మారుతున్న జీవనశైలి
- చాలామందిలో కంటిచూపు సమస్యలు
- విటమిన్ టెస్టులు చేయించుకోవాలంటున్న నిపుణులు
- పోషకాల ద్వారా చూపు మెరుగుపర్చుకోవచ్చని వెల్లడి
'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం' అని ఊరికే అనలేదు. మెదడుకు ప్రపంచాన్ని పరిచయం చేసేవి కళ్లే. మానవదేహంలోని అవయవాల్లో కళ్లు అత్యంత కీలకమైనవి. అయితే మారుతున్న జీవనశైలి కారణంగా కంటి చూపు తగ్గుతోందంటూ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. 50 ఏళ్ల లోపు వారు కూడా పాక్షిక అంధుల్లా మారుతున్నారు. కంటిచూపు తగ్గడానికి వివిధ కారణాలతో పాటు రెండు కీలక విటమిన్ల లోపం కూడా కారణం అయ్యుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మానవదేహంలోని వ్యవస్థలు సజావుగా పనిచేయాలంటే విటమిన్లు, ఖనిజలవణాలు, సూక్ష్మపోషకాలు ఎంతో అవసరం. మొత్తం 13 విటమిన్లు శారీరక ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. అయితే వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బీ12 లోపిస్తే కంటిచూపు మందగిస్తుందట. ఈ రెండు విటమిన్ల లోపం కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
విటమిన్ ఏ లోపం వల్ల కంటిలోని కార్నియా ఎండిపోయినట్టుగా మారుతుందని, దాంతో రెటీనా కూడా దెబ్బతింటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తద్వారా అంధత్వం కలుగుతుందని వివరించింది. ప్రతి ఏటా 2.5 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో అంధత్వం బారినపడుతున్నారని తెలిపింది. వారిలో సగం మంది ఏడాదిలోపే మృత్యువాత పడుతున్నారని కూడా డబ్ల్యూహెచ్ఓ సంచలన వాస్తవాలు వెల్లడించింది.
విటమిన్ బీ12 కూడా చూపు కోల్పోవడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మెదడు, నాడీ కణాల అభివృద్ధిలో విటమిన్ బీ12దే కీలకపాత్ర. ఈ విటమిన్ లోపించడం వల్ల ఆప్టిక్ న్యూరోపతీ (కంటి నరాల వాపు-నాడీ కణజాలం దెబ్బతినడం) సంభవిస్తుందట. ఇది తాత్కాలికంగా కంటి చూపును కోల్పోయేలా చేస్తుందని, దీర్ఘకాలంలో మాత్రం నష్టం తీవ్రంగా ఉంటుందని ఆప్టోమెట్రీ అసోసియేషన్ పేర్కొంది. అందుకే, కంటిచూపు తగ్గినవారు విటమిన్ బీ12 లోపించిందేమోనని పరీక్ష చేయించుకోవాలని సూచిస్తోంది.
ఈ రెండు విటమిన్ల లోపం నుంచి తగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్లు, కొవ్వుతో ఉన్న చేపలు, జున్ను, పాలు, పెరుగు, కాలేయం వంటివి ఆహారంలో చేర్చుకుంటే విటమిన్ ఏ లోపం నుంచి బయటపడొచ్చని వివరిస్తున్నారు.
ఇక, బీ12 విటమిన్ ప్రధానంగా గొడ్డు మాంసం, పంది మాంసం, కోడిమాంసం, గుడ్లు, మటన్, టూనా, హాడాక్ వంటి చేపల్లోనూ, నత్తలు, పీతల వంటి సముద్ర జీవుల్లోనూ, పాలు, పాల ఉత్పత్తుల్లోనూ సమృద్ధిగా ఉంటుందట.