Ambati Rambabu: ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అధినేతలపై అంబటి రాంబాబు విమర్శలు
- ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైకిల్ పై తిరిగేవారన్న అంబటి
- రెండెకరాల చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారని ఆరోపణ
- చంద్రబాబు సీఎం కావాలని పవన్ కోరుకుంటున్నారని వ్యాఖ్య
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థల అధినేతలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి పచ్చ మీడియా స్థాయికి రామోజీరావు ఎదిగారని... దొంగ మార్గంలో లక్షలాది కోట్లను సంపాదించారని అన్నారు. తొలుత స్ట్రింగర్ గా పనిచేసిన ఏబీఎన్ రాధాకృష్ణ సైకిల్ మీద తిరిగేవాడని... ఏ పేపర్ లో పని చేశాడో చివరకు ఆ పేపర్ కే అక్రమంగా సంపాదించిన డబ్బుతో అధినేత అయ్యాడని చెప్పారు.
టీవీ5 నాయుడు గురించి కూడా అందరికీ తెలుసని అన్నారు. రెండెకరాలు ఉన్న చంద్రబాబు... మామను వెన్నుపోటు పొడిచి అక్రమంగా అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు సంపాదించాడని చెప్పారు. ఈ నలుగురూ దుష్ట చతుష్టయమని అన్నారు. తమది కాని అధికారాన్ని అనుభవించాలని, జగన్ నుంచి అధికారాన్ని లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు.
ఈ దుష్ట చతుష్టయానికి తోడు మరొకరున్నారని... ఆయనే చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అని అంబటి రాంబాబు అన్నారు. ఎవరైనా పార్టీ పెడితే అధికారంలోకి రావాలనుకుంటారని, సీఎం కావాలనుకుంటారని... కానీ, పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలనుకుంటాడని చెప్పారు.
పవన్ కల్యాణ్ అభిమానులు సీఎం సీఎం అంటున్నారని... కానీ పవన్ మాత్రం చంద్రబాబు సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ తీసుకుని అలా అంటున్నారని విమర్శించారు. దుష్ట చతుష్టయానికి జగన్ చేస్తున్న మంచి పనులు కనిపించవని... కుళ్లు, కుతంత్రాలతో ఏదేదో రాసి, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.