Control Room: ఏపీకి భారీ వర్ష సూచన... స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- చురుగ్గా నైరుతి రుతుపవనాలు
- తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
- నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు
- అప్రమత్తమైన ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ
నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు వానలు కురుస్తున్నాయి. ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఏపీ విపత్తు నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులను ఈ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. వర్షాకాలం రావడంతో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండడంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు అప్రమత్తమైంది. జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ప్రజలు వారి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించింది. 24 గంటలూ అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 1070, 18004250101, 08632377118కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని పేర్కొంది.
రాష్ట్రానికి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.