Nagaland: చిన్న కళ్లతో ఉపయోగాలు చెప్పిన నాగాలాండ్ మంత్రి.. వీడియో వైరల్
- కళ్లు చిన్నవైనా చూపు మాత్రం అద్భుతంగా ఉంటుందన్న మంత్రి
- సభల్లో నిద్రపోయినా ఎవరూ గుర్తించలేరన్న తెంజెన్
- దుమ్ము, ధూళి కళ్లలోకి చేరకుండా ఉంటుందని వ్యాఖ్య
- ప్రశంసించిన అసోం సీఎం
ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఉండే చిన్న కళ్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటూ నాగాలాండ్ ఉన్నత విద్య, గిరిజన వ్యవహారాల మంత్రి తెంజెన్ ఇమ్నా అలోంగ్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఆయన హాస్య చతురతకు ప్రశంసలు కురుస్తున్నాయి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఆయనను అభినందించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన తెంజెన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని ప్రజలు అంటూ ఉంటారని అన్నారు. తమకు చిన్న కళ్లు ఉన్నమాట వాస్తవమేనని, అయితే, ఆ కంటి చూపు మాత్రం అమోఘంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కళ్లు చిన్నగా ఉండడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను కూడా చెప్పుకొచ్చారు. కళ్లు చిన్నగా ఉండడం వల్ల దుమ్ము, ధూళి లోపలికి వెళ్లదని, అలాగే ఏదైనా ఎక్కువసేపు కొనసాగే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నిద్రపోయినా ఎవరూ గుర్తించలేరని ఆయన చెప్పడంతో ఒకసారిగా నవ్వులు విరిశాయి.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో మంత్రి హస్యచతురకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే వీడియోను షేర్ చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెంజెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈశాన్య ప్రజల తరపున గళం వినిపించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.