Amarnath: రాత్రంతా కొనసాగిన సహాయక చర్యలు.. 40 మంది కోసం అన్వేషణ
- అమర్ నాథ్ సమీపంలో గల్లంతైన భక్తుల కోసం గాలింపు
- మరింత మంది శిధిలాల కింద చిక్కుకుపోయి ఉంటారన్న ఆందోళనలు
- ఆపరేషన్ ముగిసిన తర్వాతే తిరిగి యాత్ర
అమర్ నాథ్ గుహ సమీపంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు కొట్టుకుపోయిన వారి ఆచూకీ ఇంత వరకు లభించలేదు. గల్లంతైన 40 మందిని గుర్తించేందుకు శనివారం రాత్రి కూడా సహాయక చర్యలు కొనసాగాయి. శుక్రవారం గుహ సమీపంలో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వరద రావడం, ఆ మార్గంలో వెళుతున్న భక్తులు కొట్టుకుపోవడం తెలిసిందే.
ఈ విపత్తు కారణంగా ఇప్పటికే 16 మంది మరణించగా, 105 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. సుమారు 15 వేలకు పైగా భక్తులను పంజ్ తార్ని లోని లోయర్ బేస్ క్యాంప్ కు తరలించింది. బురద, రాళ్ల శిధిలాల కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారన్న ఆందోళనలతో.. సహాయక చర్యలను కొనసాగించారు. ఇవి ముగిసేంత వరకు యాత్రను నిలిపివేస్తూ జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నిర్వహించిన సమీక్షలో నిర్ణయించారు. సహాయక కార్యక్రమాలను ఆర్మీ, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా చేపట్టారు. గాయపడిన వారిని హెలికాప్టర్లతో శ్రీనగర్ లోని స్కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.