Holidays: తెలంగాణలో వర్ష బీభత్సం... విద్యాసంస్థలకు మూడ్రోజులు సెలవులు
- రాగల మూడ్రోజులకు అతి భారీ వర్ష సూచన
- సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్
- అన్ని విద్యాసంస్థల మూసివేతకు ఆదేశాలు
- మంత్రులు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావం తీవ్రంగా ఉంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. రాజధాని హైదరాబాద్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో నగరం జలమయమైంది.
మరో మూడ్రోజుల పాటు అతి భారీ వర్ష సూచన చేస్తూ వాతావరణ సంస్థ ప్రకటన వెలువరించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా సోమ, మంగళ, బుధ వారాల్లో అన్ని విద్యాసంస్థలు మూసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర విద్యాశాఖకు నిర్దేశించారు. రాష్ట్రంలో వర్షాలపై ప్రగతి భవన్ లో ఆయన వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.