Pawan Kalyan: కేశ సంపదను ఆ విధంగా పీక్కోవద్దమ్మా... ఊడిపోతుంది జాగ్రత్త!: వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ విమర్శలు
- విజయవాడలో నేడు రెండో విడత జనవాణి
- హాజరైన పవన్ కల్యాణ్
- ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ
- వివిధ అంశాలపై మీడియా సమావేశం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ రెండో విడత జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. విజ్ఞప్తుల స్వీకరణ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనవాణి వంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సాహసంతో కూడుకున్నదని అన్నారు. వాస్తవానికి జనవాణి వంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాల్సిన పని అని వెల్లడించారు. ప్రజల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ప్రభుత్వానికి చూపిస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రౌడీయిజం చేసే నాయకులు అంటే తనకు చిరాకు అని వ్యాఖ్యానించారు. దౌర్జన్యాలు చేసే రౌడీలంటే ప్రజలకు భయం... గ్రామంలో వేలాది మంది ఉన్నా పాతికమంది రౌడీలను చూస్తే భయం అని తెలిపారు. అందుకే భయం నిండిన ప్రజల్లో ధైర్యం నూరిపోయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అన్నింటికీ సిద్ధపడితేనే జనవాణి వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చని అన్నారు.
"రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ సరిగా లేకపోతే ఒక మాఫియా వ్యవస్థలా తయారయ్యే ప్రమాదం ఉంది. దేనికోసం వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం పక్కదారిపట్టకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే. సింహాసనాన్ని ఖాళీ చేయ్... ప్రజలొస్తున్నారు అంటూ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారు ప్రవచించారు. నాకిష్టమైన కవి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన రాసిన కవితలోని ఓ వాక్యం అది. వీళ్లంతా అధికారం చేతిలో ఉంది కదా అని మదమెక్కి కొట్టుకుంటున్నారు.
వేరే పార్టీ నుంచి గెలిచిన నేతలున్న పంచాయతీలకు నిధులు రావడంలేదు. గాంధీ ఆకాంక్షించిన గ్రామస్వరాజ్యాన్ని చంపేశారు. ఈ ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేస్తుంటే మాకు రెండో విడత జనవాణిలో మరో 480 పైచిలుకు పిటిషన్లు వచ్చి ఉండేవి కావు. ఇది ఒకరికి సంబంధించింది కాదు. కృష్ణానదిలో దోబీ ఘాట్ కావాలని రజక సోదరులు వచ్చారు. దీని గురించి పట్టించుకునేవారే లేరు. జనసేన నేతలు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు.
దివ్యాంగుల సమస్యలు కూడా ఇలాంటివే. మణికంఠ అనే కుర్రవాడు పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నాకు నచ్చాడు అని ఫేస్ బుక్ లో చిన్న పోస్టు పెడితే అతడికి పెన్షన్ ఆపేశారు. వైసీపీ నేతలు ఇంతగా దిగజారిపోయారు. దాదాపు 3 వేల మంది దివ్యాంగులకు పెన్షన్లు ఆపేసింది చాలక, వారు నిజమైన దివ్యాంగులు కాదంటూ మరింత బాధకు గురిచేస్తున్నారు. వారు దివ్యాంగులేనని కళ్లకు కనిపిస్తున్నా గానీ గ్రామ, వార్డు సచివాలయాల్లో బెదిరింపులకు గురిచేస్తున్నారు.
కౌలు రైతుల సమస్యలు కూడా ఇలాగే ఉన్నాయి. మంగళగిరి నుంచి కొందరు రైతులు వచ్చారు. మార్చి 14న మీరు మాట్లాడినప్పుడు రెండు నెలల కౌలు డబ్బులు పడ్డాయి సార్... మళ్లీ మీరు ఇవాళ మాట్లాడితే కౌలు డబ్బులు పడతాయేమోనని వచ్చాం సార్ అని వాళ్లు చెప్పారు. ఈ ప్రభుత్వం డబ్బులు ఏంచేస్తోంది?
గతంలో చంద్రన్న బీమా పథకం ఉంటే ఇప్పుడు వైఎస్సార్ బీమా పథకం అని పేరుపెట్టుకున్నారు. పథకం పేరు మారొచ్చేమో కానీ, పథకం మాత్రం కొనసాగాలి కదా. కానీ, ఇవాళ బీమా అందడంలేదంటూ మావద్దకు ఎంతో మంది వచ్చారు. 2015 నుంచి 2019 వరకు 25 లక్షల కుటుంబాలకు రూ.3 వేల కోట్లు పరిహారం అందింది. 2019 నుంచి 2022 వరకు రూ.145 కోట్ల ప్రీమియం చెల్లిస్తే, వీళ్లిచ్చిన బీమా రూ.65 కోట్లే. కేవలం 3,375 మందికే పరిహారం చెల్లించారు.
ఇంకా మూడు వేల మందికి బీమా ఇవ్వాల్సి ఉంది. డబ్బులు ఉన్నా ఇప్పటికీ ఇవ్వడంలేదు. ఇవాళ వచ్చి వారు మాతో మొరపెట్టుకున్నారు. సమస్యను పరిష్కరించడానికి సీఎం ఉన్నారు, క్యాబినెట్ ఉంది, చీఫ్ సెక్రెటరీ ఉన్నారు, అధికారులు ఉన్నారు... కానీ అవసరంలేని ఓ మధ్యవర్తిని తీసుకొచ్చి పెట్టారు. గతంలో ఇదేమీ లేకుండా బీమా కంపెనీకే ఆ బాధ్యతలు అప్పగించేవారు. ఇప్పుడు డబ్బులు ఎటుపోతున్నాయో అర్థం కావడంలేదు.
ఎవరన్నా చనిపోతే ఓ చిన్న పార్టీ అయిన మేమే ఐదు లక్షలు ఇస్తున్నాం... ప్రభుత్వం దగ్గర ఆ మాత్రం డబ్బు కూడా లేదా? ఏదన్నా మాట్లాడితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ బూతులు మాట్లాడుతున్నారు. పైగా కేశ సంపదను వివిధ రకాలుగా వాడుతున్నారు... కేశ సంపదను ఆ విధంగా పీక్కోవద్దమ్మా... ఉన్నదంతా ఊడిపోతుంది జాగ్రత్త!" అంటూ హితవు పలికారు.
"ఇక భవన నిర్మాణ కార్మికుల అంశం కూడా కీలకమైంది. సమాజంలో 40 శాతం శ్రామికశక్తి కాగా, వాళ్లలో 4వ వంతు మేస్త్రీలు, పెయింటర్లు, ప్లంబర్లు ఇతర భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. వాళ్ల సంక్షేమ నిధిలో రూ.918 కోట్లు ఉన్నాయి. ఇవాళ వాళ్లకి సంబంధించిన నిధులు ఆపేశారు. ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఇసుక దొరుకుతుంది కానీ అంతా తమిళనాడుకు, కర్ణాటకకు వెళ్లిపోతుంది... ఇక్కడికొచ్చేసరికి ధర పెరిగిపోతోంది అని కొందరు నాతో చెప్పారు. ఒకప్పుడు రూ.6 వేలకు దొరికే ఇసుక ఇప్పుడు అంతకంతకు ధర పెరిగిపోయింది.
నేను గతంలోనే ఇసుక అక్రమాలపై గళం ఎత్తాను. వీళ్లు అంతకంటే రెచ్చిపోయి అక్రమాలు చేశారు. గత మూడేళ్లుగా మేడే కార్యక్రమాలు నిర్వహించకపోవడం చూస్తుంటే వైసీపీ నేతలకు కార్మికులంటే ఎంత గౌరవమో అర్థమవుతుంది. కార్మిక మంత్రి ఏనాడైనా సమస్యలు తెలుసుకున్నారా? అన్ని విభాగాలకు కలిపి సజ్జల వంటి పెద్దలు ఒకరే మంత్రిగా ఉంటారు" అంటూ విమర్శలు గుప్పించారు.
"ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లకు ప్రభుత్వం సాయం చేయాలి. కానీ వాటికి కూడా అన్యాయం చేస్తోంది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫ్రెండ్లీగా ఉండడం చూస్తున్నాం. ఆలింగనాలు చేసుకుంటారు, అలయ్ బలయ్ లు చేసుకుంటారు... ఇద్దరూ చాలా సౌకర్యవంతంగా ఉంటారు, ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో చాలా కులాలు, ఉత్తరాంధ్రలో 18 వరకు కులాలు బీసీ హోదా కోల్పోయాయి. దీని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడుకోరు. తెలంగాణలో బేడ బుడగజంగాల కులమే లేదంటూ వారి గుర్తింపును రద్దు చేశారు.
వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగడంలేదు. దీని గురించి పట్టించుకునేవారే లేరు... ప్రకాశం జిల్లా నుంచి, పులిచింతల ప్రాజక్టు నుంచి మా వద్దకు వచ్చారు. పరిహారం అందడంలేదని, తాము ఎవరిని కలవాలో తెలియడంలేదంటూ వాపోయారు" అంటూ పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో వివరించారు.