Assam: అసోంలో అమానుషం.. పంచాయతీ తీర్పులో దోషిగా తేల్చి, వ్యక్తిని సజీవ దహనం చేసిన గ్రామ పెద్దలు
- ఓ మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రంజిత్
- సజీవ దహనం అనంతరం పూడ్చిపెట్టిన వైనం
- పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసులు, చట్టాలు ఉన్నా గ్రామాల్లో పంచాయితీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చాలా వరకు గ్రామాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండానే పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాయి. కొన్ని సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కారమైతే మరికొన్ని మాత్రం అమానుషంగా ముగుస్తుంటాయి. ఇలాంటి ఘటనే ఒకటి అసోంలోని నాగోన్ జిల్లాలో జరిగింది.
పెద్దల పంచాయితీలో ఓ వ్యక్తిని అందరి ముందే ఒంటికి మంటలంటించి సజీవంగా చంపేశారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోర్‌లులుగావ్ గ్రామానికి చెందిన రంజిత్ బార్దోలోయ్ ఓ మహిళ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి ఆమెను హత్య చేసింది రంజితేనని తేల్చారు. ఆపై అందరి ముందే అతడిని సజీవ దహనం చేసి పూడ్చి పెట్టారు.
విషయం పోలీసులకు చేరడంతో వెంటనే వారు గ్రామానికి చేరుకుని గ్రామపెద్దలు పూడ్చిపెట్టిన రంజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి శరీరంపై 90 శాతం కాలిన గాయాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.