O Panneerselvam: అన్నాడీఎంకే నుంచి పన్నీర్ సెల్వం బహిష్కరణ
- ప్రాథమిక సభ్యత్వం రద్ధు చేస్తూ జనరల్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం
- మరొకరిని ట్రెజరర్ గా నియమించిన పళనిస్వామి
- ఏకనాయకత్వానికి పన్నీర్ సెల్వం అంగీకరించలేదని ఆరోపణ
- తనను తొలగించే అధికారం వారికి లేదన్న పన్నీర్ సెల్వం
రాజకీయాల్లో తలదన్నేవాడు ఉంటే, తాడిని దన్నే వాడు ఉంటాడన్నది అక్షరాల నిజం. అన్నాడీఎంకేలో ఇద్దరు బలమైన నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం విషయాన్ని గమనిస్తే.. జయలలిత తర్వాత అన్నాడీఎంకే పార్టీ ముక్కలు కాకుండా ఈ ఇద్దరు ముఖ్య నేతలు కలసి కట్టుగా సాగారు. కానీ, ఆ తర్వాత కాలంలో వీరి మధ్య అంతరం పెరిగిపోయింది. ఎవరికి వారే నంబర్ 1 అవ్వాలన్న కాంక్ష మారి మధ్య ఎడాన్ని పెంచింది. వీరిలో పన్నీర్ సెల్వం మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఎంతో విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి.
అలాంటి వ్యక్తిని అదును చూసి పళనిస్వామి దెబ్బ కొట్టారు. ఏకంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. జయలలిత సన్నిహితురాలైన శశికళ చేతికి పార్టీకి వెళ్లకుండా కాపాడుకున్న ఇద్దరు నేతల్లో ఇప్పుడు పళనిస్వామి అగ్రనేతగా ఎదిగారు. సోమవారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ (పార్టీ అత్యున్నత నిర్ణయాల విభాగం) పళనిస్వామిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడమే కాకుండా.. పన్నీర్ సెల్వమ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పార్టీలో ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్ధు చేసింది.
అలాగే పన్నీర్ సెల్వం మద్దతుదారులైన వైతిలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకరన్ ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తం 16 తీర్మానాలు జనరల్ కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పార్టీ కార్యాలయం ముందు ఇరు వర్గాలు నిరసన చర్యలకు దిగాయి. పన్నీర్ సెల్వం మద్దతుదారులు చెప్పులతో పళనిస్వామి ఫొటోలను కొట్టడం కనిపించింది. పన్నీర్ సెల్వం దిష్టి బొమ్మలను పళనిస్వామి మద్దతు దారులు దహనం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చారు.
దీంతో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు సెక్షన్ 144 విధించారు. పార్టీ ట్రెజరర్ గా ఉన్న పన్నీర్ సెల్వం స్థానంలో దిండుగల్ శ్రీనివాసన్ ను పళనిస్వామి నియమించారు. సీనియర్ నేతలు పలు మార్లు పన్నీర్ సెల్వంతో ఏక నాయకత్వంపై చర్చలు నిర్వహించినా.. ఆయన అంగీకరించలేదని పళనిస్వామి ప్రకటించారు. పన్నీర్ సెల్వం డీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు.
ఇదిలావుంచితే, పళనిస్వామి, మునుస్వామిలకు తనను బహిష్కరించే అధికారం లేదని పన్నీర్ సెల్వం ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తానే వారిద్దరిని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. తనను అన్నాడీఎంకే కోర్డినేటర్ గా 1.5 కోట్ల మంది పార్టీ సభ్యులు నిర్ణయించినట్టు చెప్పారు.