Rohit Sharma: వీళ్లేమైనా పండితులా?... కోహ్లీకి రోహిత్ శర్మ మద్దతు
- ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో కోహ్లీ విఫలం
- మళ్లీ మొదలైన విమర్శలు
- క్రికెట్ లో ఎవరు పండితులు? అంటూ ప్రశ్నించిన రోహిత్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్ తో రెండు టీ20ల్లోనూ కోహ్లీ ఆశించిన మేర రాణించలేదు. దాంతో విమర్శకులు కూడా రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో, కోహ్లీకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. ఈ విమర్శలు చేసేవాళ్లేమైనా పండితులా? అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
"క్రికెట్ లో పండితులు ఎవరు? అసలు ఇలాంటి వాళ్లను కూడా పండితులు అంటారా? అనేది అర్థం కావడంలేదు. మైదానంలో జరిగే ఆటను వాళ్లు బయటి నుంచి చూస్తారు. లోపల ఏం జరుగుతుందో వాళ్లకు తెలియదు. జట్టుగా మేం ఓ నిర్మాణ క్రమంలో ఉన్నాం. మాకంటూ నిర్దిష్ట ఆలోచనా విధానం ఉంది. తెరవెనుక ఎంతో చర్చ ఉంటుంది. మరెంతో ఆలోచన ఉంటుంది. ఆటగాళ్లకు ఎప్పుడూ మద్దతు ఉంటుంది, వారికి అవకాశాలు ఇస్తాం. బయటి వాళ్లకు ఇవన్నీ అర్థం కావు. బయట ఏం జరుగుతుందనేది మాకు ముఖ్యం కాదు. విమర్శలను ఏమాత్రం పట్టించుకోం.
ఫాం గురించి చెప్పాల్సి వస్తే ప్రతి ఒక్కరికీ ఎత్తుపల్లాలు సహజం. కానీ ఓ ఆటగాడిలో నాణ్యత ఎప్పుడూ తరిగిపోదు... ఆ విషయాన్ని మేం మర్చిపోం. విమర్శలు చేసినంత మాత్రాన ఓ ఆటగాడి నాణ్యతకు భంగం కలగదు. ఓ ఆటగాడిలో నాణ్యత ఉంటే మేం మద్దతుగా నిలుస్తాం. ఇది నాతో సహా ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఒకటి రెండు సిరీస్ లతో ఓ ఆటగాడ్ని అంచనా వేయలేం. అతడు చాలాకాలం పాటు నిలకడగా ఆడితేనే అది అతడి నాణ్యతను సూచిస్తుంది. అతడి గురించి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది" అంటూ రోహిత్ శర్మ తన అభిప్రాయాలు వెల్లడించాడు.