Karnataka: మువ్వన్నెల రంగుల్లో జాలువారుతున్న జలాలు!.. వీడియో ఇదిగో!
- కృష్ణ రాజ సాగర్ డ్యాం వద్ద ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ
- భారీ వర్షాలతో నిండిన కర్ణాటక ప్రాజెక్టు
- అన్ని గేట్లను ఎత్తేసి కిందకు నీటి విడుదల
భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఆయా ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో అధికారులు జలాలను దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తగానే కిందకు దుమికే జల దృశ్యాలు కమనీయంగా ఉంటాయి. ఈ తరహా దృశ్యాలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ దృశ్యాలు మరింతగా ఆకట్టుకునేలా చేసింది కర్ణాటక అధికార యంత్రాంగం. ప్రాజెక్టు నుంచి జాలువారే జలాలకు భారత జాతీయ జెండా రంగులను అద్దింది. దీంతో ఆ జాలువారే జల దృశ్యాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి.
ఇలా మువ్వన్నెల జెండా రంగుల్లో జాలువారే జల దృశ్యాలు కర్ణాటకలోని కృష్ణ రాజ సాగర డ్యాం వద్ద ఆదివారం రాత్రి కనిపించాయి. మండ్య జిల్లాలోని ఈ ప్రాజెక్టు భారీ వర్షాల కారణంగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగా... ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తేసి జలాలను అధికారులు కిందకు వదిలారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ కారణంగా ప్రాజెక్టు గేట్ల నుంచి జాలువారుతున్న జలాలు మూడు రంగుల్లో కనిపించాయి.