Congress: సోనియా గాంధీకి ఈడీ సమన్లు... 21న విచారణకు రావాలంటూ ఆదేశం
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమన్లు
- ఇదివరకే రాహుల్ గాంధీని విచారించిన ఈడీ
- అనారోగ్యం నుంచి కోలుకోవడంతో తాజాగా సోనియాకు సమన్లు
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం తాజాగా సమన్లు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ సదరు సమన్లలో వారు సోనియాను ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తుల కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇదివరకే సోనియాతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ సమన్లు జారీ అయ్యాక సోనియా కరోనా బారిన పడగా... రాహుల్ గాంధీ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
అనారోగ్య కారణాల వల్ల తాను ఇప్పటికిప్పుడు విచారణకు హాజరు కాలేనని, తనకు కనీసం మూడు వారాల సమయం కావాలంటూ సోనియా గాంధీ ఈడీకి సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అభ్యర్థనకు సానుకూలంగానే స్పందించిన ఈడీ సోనియా విచారణను వాయిదా వేసింది. కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సోనియా ఇటీవలే డిశ్చార్జీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆమెకు తాజాగా సమన్లు జారీ చేశారు.