YV Subba Reddy: రద్దీ తగ్గేవరకు సర్వదర్శన భక్తులకు ప్రస్తుత విధానమే అమలు: టీటీడీ నిర్ణయం
- టీటీడీ పాలకమండలి సమావేశం
- చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పలు అంశాలపై చర్చ
- నిర్ణయాలను మీడియాకు తెలిపిన వైవీ
- సెప్టెంబరు 27 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నేడు సమావేశమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోందని, భక్తుల రద్దీ తగ్గేంతవరకు సర్వదర్శన భక్తులకు ప్రస్తుత విధానమే అమలు చేస్తామని వివరించారు. సర్వదర్శన భక్తులకు స్లాట్ (టోకెన్) విధానంపై అధ్యయనం జరుగుతోందని అన్నారు.
ఈసారి భక్తుల నడుమ, మాడవీధుల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు జరుగుతాయని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సెప్టెంబరు 27న రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తుందని తెలిపారు.
టీటీడీ ఇతర నిర్ణయాలు ఇవిగో...
- దేశవ్యాప్తంగా శ్రీవారి వైభవోత్సవాల నిర్వహణ
- ఆగస్టు 16 నుంచి 20 వరకు నెల్లూరులో వైభవోత్సవాలు
- రూ.154 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు
- రూ.7.32 కోట్లతో యస్వీ గోశాలకు పశుగ్రాసం కొనుగోలు
- రూ.2.7 కోట్లతో నూతన పార్వేటి మంటపం
- రూ.2.9 కోట్లతో అమరావతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పచ్చదనం అభివృద్ధి
- రూ.18 లక్షలతో బేడి ఆంజనేయస్వామికి స్వర్ణకవచం
- ఆక్టోపస్ కోసం కేటాయించి భవన నిర్మాణానికి మరో రూ.7 కోట్లు
- యంత్రాలతో లడ్డూ ప్రసాదం బూందీ తయారీపై అధ్యయనం
- ప్రసాదాల తయారీకి ఉపయోగించే సేంద్రియ ముడిసరుకుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ తో ఒప్పందం
- ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం పనులు